కర్నూలు జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం వున్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుటుంబానికి చంద్రబాబునాయుడు చెక్ పెట్టనున్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. ఇందులో భాగంగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తనయుడు సూర్యప్రకాశ్‌రెడ్డికి ఈ దఫా టీడీపీ టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని కాదని మరొకరిని బరిలో నిలిపేందుకు చంద్రబాబు కొత్త అభ్యర్థిని రెడీ చేసుకుంటున్నారని తెలిసింది.
ఈ విషయంలో తన ప్రత్యర్థి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అనుసరించేందుకు చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారు. కర్నూలు లోక్‌సభ సీట్లను 2014, 2019లలో చేనేత సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుక, డాక్టర్ సంజీవ్‌కుమార్‌లకు వైసీపీ ఇచ్చి, గెలిపించుకుంది. అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా బీసీలకు వైసీపీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో టీడీపీ కూడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలో కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కర్నూలు ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కురుబలు ఎక్కువగా వున్నారు. గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్‌కు హిందూపురం లోక్‌సభ స్థానాన్ని వైసీపీ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన ఆ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇలా అన్ని కులాల వాళ్లకు వైసీపీ టికెట్లు ఇవ్వడం వల్లే ఘన విజయం సాధించినట్టు టీడీపీ కూడా నమ్ముతోంది. జగన్‌లా తాను కూడా సోషల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చేందుకు చంద్రబాబు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై వేటు వేసేందుకు రాజకీయ కత్తిని చంద్రబాబు చేతిలో రెడీగా ఉంచుకున్నారు. కోట్ల కుటుంబానికి ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యే సీటుతో సరిపెట్టేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి కోట్ల కుటుంబం పోటీ చేస్తోంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మరణానంతరం 2004, 2009లలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. అంతేకాదు, ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా పని చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం కాంగ్రెస్ తరపున 2014లో కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది. 2019లో కర్నూలు నుంచి మరోసారి ఆయన బరిలో నిలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసి చేనేత సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేత డాక్టర్ సంజీవ్‌కుమార్ చేతిలో ఓడిపోయారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కోట్ల కుటుంబానికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు వెనుకాడడం లేదు.