తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. సాధారణంగా జంబో మేనిఫెస్టో తయారుచేస్తుంటుంది. వర్గాలు, కులాలు లాంటి రకరకాల లెక్కలతో తలా ఒక హామీ విదిలిస్తూ మేనిఫెస్టో తయారుచేస్తుంది. గెలవకపోతే హేపీ.. మేం అవన్నీ చేయాలనుకున్నాం కానీ మీరు చాన్సివ్వలేదు అని జనాన్ని నిందిస్తుంది. గెలిస్తే మాత్రం.. ఆ మేనిఫెస్టో కాపీలు దొరక్కుండా, కనీసం పార్టీ వెబ్ సైట్లో కూడా లేకుండా మాయం చేస్తుంది. చెప్పిన హామీలన్నీ మరచిపోతుంది. ఇది సాధారణంగా జరిగే తంతు.
ఈ ఏడాది కూడా తెలుగుదేశం మేనిఫెస్టోపై పెద్ద కసరత్తే ప్రారంభించింది. చినబాబు లోకేష్ పాదయాత్రలో గమనించిన అంశాలన్నీ మేనిఫెస్టోలో కలుపుతామని కూడా అన్నారు. ఆల్రెడీ మినీ మేనిఫెస్టో కూడా ప్రకటించుకున్నారు. దసరా నాటికి మేనిఫెస్టో తెస్తాం అని వాయిదా వేశారు. తుది వంటకాన్ని ఇంకా మసాలా వేసి నూరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేనిఫెస్టో విషయంలో కూడా జనసేన తెలుగుదేశం మీద పైచేయి సాధించే అవకాశం కనిపిస్తోంది.
చంద్రబాబును పవన్ కల్యాణ్ కలిసిన తర్వాత.. రెండు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో తెస్తాయని ప్రకటించారు. జనసేన తమ మేనిఫెస్టో అంశాలను తెలుగుదేశానికి అందిస్తుందని పవన్ అన్నారు. అందుకోసం పార్టీ తరఫున 20 మందితో ఒక కమిటీ వేశారు. వీరినుంచి సేకరించిన అభిప్రాయాలతో.. ఒక పీపుల్స్ మేనిఫెస్టో ముసాయిదా ప్రతిని తయారుచేసి దానిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ కు, కమిటీ సారధి హరిరామజోగయ్య అందించారు. 47 సంక్షేమ పథకాలు, 75 వేల కోట్ల రూపాయల అంచనాతో ఈ మేనిఫెస్టో చేశాం అన్నారు.
అయితే తెల్లరేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అనే హరిరామజోగయ్య ప్రతిపాదన చూస్తోంటే.. జగన్ సర్కారు అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారుల్లో సగం మందికి కోత తప్పదని తెలుస్తోంది. వీరి ప్రభుత్వం గెలిస్తే.. ఇప్పుడు ప్రభుత్వ సాయం పొందుతున్న వారిలో సగం మందికి మొండిచెయ్యి చూపిస్తారనే అనుమానం కలుగుతోంది.
అసలు మాట చెప్పి, అమలు చేయకుండా మాయచేసే చంద్రబాబునాయుడుకు, పవన్ కల్యాణ్ ఇలాంటి అయిడియాలో ఇస్తే.. నెపం పవన్ మీద నెట్టేసి.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో కోత పెట్టేస్తారని అంతా అనుకుంటున్నారు.