విశాఖకు బాబు… అడ్డుకుంటారా…?

విశాఖకు టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన రావాలనుకుంటున్నారు కానీ ఎందుకో వాయిదా పడుతోంది. ఇవన్నీ ఎందుకు అన్నట్లుగా ఈ ఏడాది పోనీయకుండా ఉత్తరాంధ్రా టూర్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి…

విశాఖకు టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన రావాలనుకుంటున్నారు కానీ ఎందుకో వాయిదా పడుతోంది. ఇవన్నీ ఎందుకు అన్నట్లుగా ఈ ఏడాది పోనీయకుండా ఉత్తరాంధ్రా టూర్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. చంద్రబాబు ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు విజయనగరం జిల్లాలో పర్యటిచబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన గజపతినగరం, బొబ్బిలి, రాజాంలలో పర్యటిస్తారని, రోడ్ షోస్ చేస్తారని తెలుస్తోంది.

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ బాబు ఈ మధ్య వివిధ జిల్లాలలో టూర్లు తిరుగుతున్నారు. ఇపుడు ఆయన ఉత్తరాంధ్రాలో కూడా పర్యటించాలనుకుంటున్నారు. ఈ మధ్యనే విశాఖ రాజధాని అంటూ నాన్ పొలిటికల్ జేఏసీ ప్రజాసంఘాలు  హడావుడి చేస్తున్న పరిస్థితి ఉంది.

విశాఖను పాలనారాజధానిగా చేయడం తధ్యమని మంత్రి గుడివాడ అమరనాధ్ తడవకోసారి చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు విశాఖ వస్తే రాజధాని డిమాండ్ నాన్ పొలిటికల్ జేఏసీ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈమధ్యనే కర్నూల్ లో చంద్రబాబు టూర్ చేస్తే న్యాయ రాజధాని మీద టీడీపీ విధానం చెప్పాలంటూ జేఏసీ డిమాండ్ చేసింది.

అమరావతి ఏకైక రాజధాని అని ఈ రోజుకీ టీడీపీ అంటోంది. ఉత్తరాంధ్రా పర్యటనకు వస్తున్న బాబు విశాఖ విషయంలో ఏమి చెబుతారో అన్న ఆసక్తి అయితే సర్వత్రా ఉంది. బాబు 2020లో విశాఖ వస్తే ఎయిర్ పోర్టు వద్దనే భారీ నిరసన వ్యక్తం అయింది. విశాఖ రాజధాని మీద ఆయన అనుకూలంగా మాట్లాడాలని కోరారు. మళ్ళీ అటువంటి సీన్లు రిపీట్ అవుతాయా అంటే బాబు విశాఖ రాజధాని మీద మాట్లాడే దాన్ని బట్టే ఉంటుంది అని వైసీపీ నేతలు  అంటున్నారు.