రాజకీయ పార్టీలు అభిమానుల విరాళాల ఆధారంగానే నడుస్తాయి. సాధారణంగా చాలా వరకు బ్లాక్ మనీ కూడా రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో ప్రవహిస్తుంటుందనే ప్రచారం కూడా ఉంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకు వందల కోట్ల రూపాయల విరాళాలు వెల్లువెత్తుతుంటాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు తక్కువ విరాళాలే వస్తుంటాయి.
సాధారణంగా ఈ విరాళాలు.. పార్టీల ద్వారా లబ్ధి పొందే పారిశ్రామిక వేత్తల నుంచి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే.. వారి ద్వారా లబ్ధి పొందవచ్చునని ఆశించే వారి నుంచి వస్తుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, ఇప్పుడు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు.. విదేశాల్లో ఉన్న ఎన్నారై తెలుగువారి నుంచి విరాళాలు దండుకోవడం మీద కన్నేశారు. ఎన్నారైలు తమ పార్టీకి ఇతోధికంగా విరాళాలు ఇచ్చి సహకరించాలని ఆయన పిలుపు ఇచ్చారు.
కడప జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు బద్వేలు నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్నారు. తెదేపా పాలన వల్ల విదేశాల్లో స్థిరపడిన వాళ్లంతా పార్టీకి విరాళాలు ఇవ్వాలని చంద్రబాబునాయుడు అన్నారు. ఏదో కులపిచ్చి గానీ, పార్టీ పిచ్చిగానీ ఉన్న- విదేశాల్లో దండిగా సంపాదించుకుంటున్న వాళ్లనుంచి విరాళాలు అడగడం ఒక ఎత్తు. అలా కాకుండా, ‘తెలుగుదేశం పాలన వలన’ అనే మెలిక పెట్టడం ఏంటో అర్థం కాదు. తెదేపా పాలనలో అమెరికాలో ఏమైనా పరిశ్రమలు స్థాపించి.. తెలుగువారికి అక్కడ ఉద్యోగావకాశాలు కల్పించారో ఏమో తెలియదు. ఆయన పాలన వల్ల .. జనం విదేశాలకు పోవడం ఎలా జరుగుతుందో మనకు బోధపడదు.
నిజానికి తెలుగుదేశం పార్టీకి విదేశాలలో స్థిరపడిన కమ్మ సామాజిక వర్గం సంపన్నుల నుంచి మద్దతు ప్రతిసారీ దండిగానే ఉంటుంది. ఇప్పటికే అమెరికాలో తెలుగుదేశానికి అనుకూలంగా లక్షల డాలర్ల విరాళాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు కమ్మవారిలో కూడా కొంత వెరపు పుడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సొంత ఊర్లను వదలి, విదేశాలకు వచ్చి తాము విరాళాలు సేకరించి ఇస్తోంటే.. ఈ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవని, తమకు చిన్నపాటి ప్రత్యుపకారం కూడా ఉండదని, ఎవరికి వారు అవినీతి సొమ్ములు స్వాహాచేయడంలో నిమగ్నం అయిపోతారని అనుకుంటున్నారట.
తెలుగుదేశం గతంలో పాలన సాగించినప్పుడు వందలకోట్లు దండుకున్న నాయకులందారూ ఆ డబ్బు మూటలు బయటకు తీసి ఇప్పుడు పెట్టుబడిలాగా పెట్టుకోవచ్చు కదా.. కష్టపడి సంపాదిస్తున్న తమను విరాళాలు దేబిరించకపోతే అనే విమర్శలు కూడా ఎన్నారైల నుంచి వివనస్తున్నదట.