ఎమ్బీయస్‍: బిజెపి విన్నింగ్ ట్రాక్ రికార్డ్

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తుందా రాదా అనే చర్చ నడుస్తోంది. ముఖాముఖీ పోరైతే ఎలా ఉండేదో కానీ త్రిముఖమైన పోటీ ఉందక్కడ. అలా ఉండే సందర్భాల్లో, బహుముఖ…

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తుందా రాదా అనే చర్చ నడుస్తోంది. ముఖాముఖీ పోరైతే ఎలా ఉండేదో కానీ త్రిముఖమైన పోటీ ఉందక్కడ. అలా ఉండే సందర్భాల్లో, బహుముఖ పోరున్న సందర్భాల్లో బిజెపి ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో గుర్తు చేసుకోవడానికి యీ వ్యాసం రాస్తున్నాను. ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు వచ్చి నెలన్నరయింది. అవి మనకు అంతగా ఆసక్తికరం కాకపోయినా, కర్ణాటక నేపథ్యంలో వాటిపై ఆసక్తి కలుగుతోంది. మార్చి 2న త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఫలితాలు వెలువడ్డాయి. ఇవన్నీ పేరుకి రాష్ట్రాలే కానీ ఓటర్ల సంఖ్య దృష్ట్యా చిన్నవే. త్రిపురలో 28.15 లక్షల ఓటర్లున్నారు. నాగాలాండ్‌లో ఓటర్లు 10.06 లక్షలు, మేఘాలయ ఓటర్లు 21.62 లక్షలు. మన మల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 31.50 లక్షలు!

కర్ణాటకలో లాగానే త్రిపురలో కూడా ముప్పేటపోరే. అధికార బిజెపి-ఐపిఎఫ్‌టి ఒక కూటమిగా, లెఫ్ట్-కాంగ్రెసు మరో కూటమిగా, టిఎంపి మూడో పక్షంగా పోటీ చేశాయి. 60 సీట్ల త్రిపుర అసెంబ్లీలో ఎన్నికలకు ముందు బిజెపి కూటమికి 44 సీట్లుండేవి. 2022లో బిజెపి నుంచి 5 గురు ఎమ్మెల్యేలు పార్టీ విడిచి వెళ్లారు. ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉందని గ్రహించిన బిజెపి అధినాయకత్వం ఎన్నికలకు 10 నెలల ముందు ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ (ఇతని గురించి 2018లో రాసిన వ్యాసం వీలైతే చదవండి)ని తొలగించి అతని స్థానంలో మృదుస్వభావి ఐన దంతవైద్యుడు మానిక్ సాహాను తెచ్చింది. అయినా 90% ఓటింగు జరిగిన యీ ఎన్నికలో అధికార కూటమి 10.7% ఓట్లను, 11 సీట్లను పోగొట్టుకుని, 40.2% ఓట్లు, 33 సీట్లతో బొటాబొటీ మెజారిటీ తెచ్చుకుంది. బిజెపికి గతంలో కంటె 4 తక్కువగా 32 సీట్లు, 4.6% తక్కువగా 39% ఓట్లు వచ్చాయి. భాగస్వామి ఐపిఎఫ్‌టికి గతంలో కంటె 6 తక్కువగా 1 సీటు, 6% తక్కువగా 1.3% ఓట్లు వచ్చాయి.

వీళ్లకు వ్యతిరేకంగా పోటీ చేసిన లెఫ్ట్-కాంగ్రెస్ కూటమిలో లెఫ్ట్ పక్షాన సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఒక స్వతంత్రుడు ఉన్నారు. సిపిఎం తప్ప వేరెవ్వరూ సీట్లు గెలవలేదు. 2018లో లెఫ్ట్ ఒంటరిగా పోటీ చేసి 32.2% ఓట్లు, 16 సీట్లు తెచ్చుకుంది. ఈసారి బద్ధశత్రువైన కాంగ్రెసుతో జట్టు కట్టడం వలన వాళ్లకి 13 సీట్లు కేటాయించి, తను 47టిలో పోటీ చేసింది. కాంగ్రెసు గతంలో 1.8% ఓట్లు, 0 సీట్లు తెచ్చుకుంటే యీసారి 8.6% ఓట్లు, 3 సీట్లు తెచ్చుకుంది. సిపిఎంకి ఓట్లు, సీట్లు తగ్గి, యీసారి 24.6% ఓట్లు, 11 సీట్లు తెచ్చుకుంది. లెఫ్ట్-కాంగ్రెసు కూటమి ఆఖరి నిమిషం దాకా తేలకపోవడంతో కార్యకర్తలు కలిసి పని చేయలేదు. ఓట్ల బదిలీ జరగలేదు. ఓటర్లు దీన్ని అవకాశవాద పొత్తు గానే చూశారు.

2018 వరకు సిపిఎం అధికారపక్షంగా, కాంగ్రెసు ప్రతిపక్షంగా ఉండేది. 2018 వచ్చేసరికి కాంగ్రెసు ఓటంతా బిజెపికి బదిలీ అయిపోయి, బిజెపి అధికారపక్షమైంది. కాంగ్రెసు తుడిచిపెట్టుకుపోయి, సిపిఎం ప్రతిపక్షమైంది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా బిజెపి అధికారం కోల్పోతుందని, తాము తిరిగి అధికారంలోకి వస్తామని లెఫ్ట్ ఆశ పెట్టుకుంటే, దానికి గండి కొడుతూ ఈసారి టిఎంపి (తిప్రా మోతా పార్టీ) అనే ప్రాంతీయ పార్టీ మూడో పక్షంగా ముందుకు వచ్చింది. బిజెపి ఓట్లని అది చీలుస్తుందని భయపడిన లెఫ్ట్, కాంగ్రెసుతో చేతులు కలిపి దానికి ఊపిరి పోసి 3 సీట్లు తెచ్చిపెట్టింది.

టిఎంపి అనుకున్నంత పనీ చేసింది. తనకు బలం ఉన్న 20 గిరిజన స్థానాల్లోనే కాకుండా గిరిజన జనాభా 15%కు మించి ఉన్న 12 స్థానాలతో పాటు మరో 10 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. దీంతో కనీసం 12 స్థానాల ఫలితాలు అటువి యిటయ్యాయి. 20 స్థానాల్లో టిఎంపికి వచ్చిన ఓట్లు బిజెపి మెజారిటీ కంటె ఎక్కువున్నాయి. ఓట్ల చీలిక బిజెపికి లాభించి, స్వల్ప మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. కానీ టిఎంపి బిజెపిని కూడా దెబ్బ తీసింది. బిజెపి ఉపముఖ్యమంత్రి ఆ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. మొత్తం మీద ఎన్‌డిఏకు 10.17 లక్షలు, లెఫ్ట్-కాంగ్రెస్‌కు 9.11 లక్షలు, టిఎంపి కి 4.98 లక్షలు ఓట్లు వచ్చాయి.

త్రిపుర రాజవంశీకుడు, టిఎంపి స్థాపకఅధ్యక్షుడు ప్రద్యోత్ మాణిక్య దేవవర్మ. తమ ప్రాంతాన్ని గ్రేటర్ తిప్రాలాండ్ పేర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలనే డిమాండుతో 2021లో పార్టీ పెట్టాడు. అప్పటిదాకా బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న ఐపిఎఫ్‌టిని తోసిరాజని తన భాగస్వామితో కలిసి, త్రిపుర ట్రైబల్ ఏరియాస్ ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ 2021 ఎన్నికలలో 28 స్థానాలకు గాను 18టిలో గెలిచాడు. బిజెపికి 9 దక్కగా, సిపిఎంకు ఏమీ రాలేదు. టిఎంపి ప్రత్యేక రాష్ట్ర డిమాండును బిజెపి, సిపిఎం, కాంగ్రెసుతో సహా ఎవ్వరూ ఆమోదించలేదు. ఎన్నికలలో త్రిశంకు ప్రభత్వం ఏర్పడుతుందని, తాము కింగ్‌మేకర్‌గా మారి ప్రభుత్వం తమ మద్దతుపై ఆధారపడేట్లు చేసుకుందామని దేవవర్మ అనుకున్నాడు. తీరా చూస్తే యిలాటి చంకకర్రల అవసరం ఏర్పడుకుండానే బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. రేషన్ కార్డులు మహిళల పేర యిచ్చి, వారిని ఆకట్టుకోవడంతో మహిళా ఓటర్లు గతంలో కంటె 3% మంది ఎక్కువగా ఓటేసి దాని గెలుపుకి దోహదపడ్డారు.

నాగాలాండ్‌లో అధికారంలో ఉన్న ఎన్‌డిపిపి (నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ)-బిజెపి కూటమి 60 సీట్లలో 37 గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్‌డిపిపికి గతంలో 18 ఉంటే యిప్పుడవి 25 ఓట్లు 25.3% నుంచి 32.2% కు పెరిగాయి. బిజెపికి ఓట్లు 15.3% నుంచి 18.8% కు పెరిగినా సీట్ల సంఖ్య 12లో ఏ మార్పూ లేదు. 8 సీట్లలో ద్వితీయ స్థానం వచ్చింది. కాంగ్రెసు పార్టీకి 2018లోనూ, యిప్పుడూ సున్నాయే. ఎన్‌పిఎఫ్ (నాగా పీపుల్స్ ఫ్రంట్) గతంలో 26 గెలిచి, అధికార కూటమిలో భాగస్వామి అయింది కానీ ఎన్నికలకు ముందు దాని సభ్యుల్లో 21 మంది ఎన్‌డిపిపి లోకి ఫిరాయించారు. దాంతో విడిగా పోటీ చేసి 7% ఓట్లతో 2 సీట్లు గెలుచుకోగలిగింది. ఎన్‌డిపిపికి చెందిన రియో 5వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు.

నాగాలాండ్‌ నుంచి తూర్పు నాగాలాండ్ విడగొట్టి వేరే రాష్ట్రంగా యివ్వాలనే డిమాండ్ బలంగా ఉంది. ఆ ప్రాంతం 6 జిల్లాలకు వ్యాపించి, 20 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగి ఉంది. బిజెపి తన మానిఫెస్టోలో దానికి ప్రత్యేక ప్యాకేజీ యిస్తానని వాగ్దానం చేసింది. ఎన్నికలలో ఎన్‌డిపిపికి 4, బిజెపికి 4, ఎన్‌సిపి (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)కి 3, ఎన్‌పిపి (నేషనల్ పీపుల్స్ పార్టీ)కి 3, లోక్ జనశక్తి (రామ్ విలాస్)కి 2, రిపబ్లికన్ పార్టీ (అఠవాలే)కి 2 రాగా స్వతంత్రులు 2 చోట్ల గెలిచారు.

60 సీట్లున్న మేఘాలయలో ఓట్ల రీత్యా బిజెపి స్థానం చిన్నదే కానీ రాజకీయంగా కీలకంగా వ్యవహరిస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో అందరికంటె అత్యధికంగా కాంగ్రెసుకు 21 సీట్ల వచ్చాయి. అది భాగస్వాములకై వెతుకుతూండగానే 47 సీట్లలో పోటీ చేసి కేవలం 2 సీట్లు గెలిచిన బిజెపి ముందుకు వచ్చి, 20 సీట్లతో ద్వితీయస్థానంలో ఉన్న ఎన్‌పిపి (నేషనల్ పీపుల్స్ పార్టీ)ని, 6 స్థానాలతో తృతీయ స్థానంలో ఉన్న యుడిపి (యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ)ని, 4 స్థానాలతో చతుర్థ స్థానంలో ఉన్న పిడిఎఫ్ (పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్)ని, రెండు స్థానాల్లో పంచమ స్థానంలో ఉన్న ఎచ్‌ఎస్‌పిడిపి (హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ)ని, ఒక స్వతంత్రుణ్ని కలిపి తనూ ఓ చెయ్యేసి మొత్తం 34 మందితో లోకసభ మాజీ స్పీకరు పిఎ సంగ్మా కొడుకు కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడేట్లు చేసింది.

కాంగ్రెసు అధిష్టానం చేసిన తాత్సారం వలననే తనకు ముఖ్యమంత్రి పదవి లేకుండా పోయిందని కోపగించుకున్న కాంగ్రెసు నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా 2022 నవంబరులో 11మంది ఎమ్మెల్యేలతో సహా పార్టీని వీడి, తృణమూల్ కాంగ్రెసులో చేరాడు, ఈ ఎన్నికలలో చాలా హడావుడే చేశాడు. తీరా చూస్తే 13.8% ఓట్లు, 5 సీట్లు వచ్చాయి. వాటిల్లో 2 సీట్లు 10, 18 ఓట్ల తేడాతో గెలిచినవే. ముకుల్ ఒక స్థానంలో నెగ్గి, మరో దానిలో ఓడిపోయాడు. కాంగ్రెసుకి 16 సీట్లు తగ్గి 5 వచ్చాయి. 15.3% ఓట్లు తగ్గి 13.1% ఓట్లు వచ్చాయి. బిజెపికి 0.3% ఓట్లు తగ్గి 9.3% ఓట్లు, గతంలో లాగానే 2 సీట్లు వచ్చాయి. అధికారంలో ఉన్న ఎన్‌పిపికి 10.8% ఓట్లు, 7 సీట్లు పెరిగి 31.5% ఓట్లు, 26 సీట్లు వచ్చాయి. ఒక సీటులో అభ్యర్థి మరణం కారణంగా ఎన్నిక జరగలేదు. ఎచ్ఎస్‌పిడిపికి 2, పిడిఎఫ్‌కు 2, కొత్తగా వచ్చిన వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి 4 రాగా యుడిపికి గతంలో కంటె 5 ఎక్కువగా 16.2% ఓట్లతో 11 సీట్లు వచ్చి ద్వితీయ స్థానంలో నిలబడింది. ఇద్దరు స్వతంత్రులు నెగ్గారు.

ఎన్‌పిపి, బిజెపిలకు కలిపి 28 మాత్రమే వచ్చాయి. దాంతో సంగ్మా 2 సీట్ల ఎచ్‌ఎస్‌పిడిపి, యిద్దరు స్వతంత్రులు కలిపి 32 మంది మద్దతు తనకుందంటూ గవర్నరు దగ్గరకి వెళ్లాడు. కానీ సాయంత్రానికి ఎచ్‌సిపిడిపి నేను వాళ్లతో లేనంది. ప్రతిపక్షాలు 11 సీట్ల యుడిపిని ముందు పెట్టుకుని మేం 29 మంది ఉన్నాం అన్నాయి. అంతలోనే బిజెపి ఏ మంత్రం వేసిందో కానీ యుడిపి వచ్చి బిజెపి-ఎన్‌పిపి సంకీర్ణంతో కలిసింది! ఎచ్‌సిపిడిపి లోలకంలా మళ్లీ యిటువైపు వచ్చేసింది. పిడిఎఫ్ వారితో చేరింది. మొత్తం మీద 40 ప్లస్ మందిని పోగేసి, కాన్రాడ్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు.

ఈ మూడు ఎన్నికల ఫలితాలు చూస్తే తెలిసేది ఏమిటంటే, ఏదో ఒకలా బిజెపి అధికారంలోకి వచ్చేయగలదు. కర్ణాటకలో త్రిముఖ పోరు ఉన్నపుడు లాభపడగలదు. ఒకవేళ త్రిశంకు సభ ఏర్పడితే ఫిరాయింపులతో బలాబలాలు మార్చేయగలదు. అలా జరగకూడదని కర్ణాటకలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు కోరుకుంటే బెంగాల్‌లో తృణమూల్‌లా కచ్చితమైన భారీ మెజారిటీతో గెలవాలి. ఆ సత్తా కర్ణాటక కాంగ్రెసుకు ఎక్కుడుంది? (ఫోటో – ప్రమాణస్వీకారాలు చేస్తున్న మానిక్ సాహా, రియో, కాన్రాడ్ సంగ్మా)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2023)

[email protected]