స్టీల్ ప్లాంట్ అమ్మడమా ఎంత మాట అని అంతా ఆవులించేవారే. కానీ కేంద్రం దూకుడు మాత్రం ఎక్కడా ఆగడంలేదు, తగ్గడంలేదు. స్టీల్ ప్లాంట్ లో ఒక విభాగానికి నిధుల కోసం ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ బిడ్లను ఆహ్వానిస్తే బీఆర్ఎస్ మేము రెడీ అంది. కానీ ఇప్పటిదాకా దాఖలు చేయలేదు. ఈ మధ్యలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ బిడ్ ని దాఖలు చేశారు.
చందాలిచ్చి అంతా ప్లాంట్ ని నిలబెట్టుకుందామని ఆయన అంటున్నారు. ఆచరణలో అది ఎంతవరకూ అయ్యేది ఉందో ఎవరికీ తెలియదు. ఇంతలో ప్రజాశాంతి అధ్యక్షుడు కె.ఏ.పాల్ రంగంలోకి వచ్చారు. ఆయన విశాఖలో మీడియా మీటింగ్ పెట్టి మరీ గంభీరమైన ప్రకటన చేశారు.
స్టీల్ ప్లాంట్ ఇలా ప్రైవేట్ అవుతూంటే ఎవరూ ఆదుకునే వారు లేరా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్ ని నేనే కొంటానని అది కూడా ఉన్న రేటుకు ఐదింతలు పెట్టి మరీ కొనేస్తాను అని పాల్ అంటున్నారు. ఇప్పటికే ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దు అని ప్రధాని నరేంద్ర మోడీని కలసి కోరానని ఆయన చెబుతున్నారు.
ఒక వేళ ప్లాంట్ అమ్మితే కొనడానికి విశాఖలో పుట్టిన వాడిగా తాను ముందుకు వస్తానని పాల్ అంటున్నారు. టెస్లా అధినేత ఎలెన్ మాస్క్ వచ్చే నెలలో హైదరాబాద్ వస్తున్నారని , ప్లాంట్ కొనడం కోసం ఆయన కూడా విరాళాలు ఇస్తారని పాల్ అంటున్నారు.
ఇదే సందర్భంలో పాల్ బాంబు లాంటి మరో మాట పేల్చారు 99 శాతం ప్రైవేటీకరణ ఇప్పటికే పూర్తి అయిందని కేంద్రం నాటకాలు ఆడుతోదని విమర్శించారు. అయినా సరే అమ్మితే కొంటామని ఆయన చెబుతున్నారు. పాల్ తనకు యాక్టింగ్ రాదని, తాన యాక్షన్ అంటే ఏంటో అంతా ఇక మీదట చూస్తారని చెబుతూ ఇది సీరియస్ పక్కా అంటున్నారు.
పాల్ తో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా మీడియా మీట్ కి రావడం అసలైన విశేషం. ప్లాంట్ ని అంతా కలసి రక్షించుకోవాలని ఆయన అంటున్నారు. పాల్ కొంటాను అంటే జేడీ అంతా కాపాడుకోవాలని చెప్పడమే విశేషం. బీఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ ని టేకోవర్ చేస్తామని ఇప్పటిదాకా చెప్పింది, బిడ్ దాకా వచ్చి ఇపుడు ఆగింది. ఇక కె.ఏ.పాల్ వంతు అంటున్నారు. ఆయన వారూ వీరూ ఎందుకు నేనే కొనేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చారు.
దీన్ని చూస్తున్న ఉక్కు కార్మికులు ఉద్యోగులకు నవ్వాలో ఏడవాలో అర్ధం కావడంలేదు అంటున్నారు. ఉక్కు ప్లాంట్ పోతే దిక్కు లేకుండా పోతామని వారు ఆవేదన చెందుతూంటే లక్షల విలువ చేసే ప్లాంట్ ని పెన్నూ పేపర్ కొన్నట్లుగా కొనేస్తామని రాజకీయ నాయకులు పార్టీలు ఎన్నికల హామీలు మాదిరిగా చెబుతూంటే ఉద్యమకారులు బిక్కమొహంతో చూడాల్సిన పరిస్థితి.