వైసీపీ యువనేత, తిరుపతి రూరల్ మండలాధ్యక్షుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ పాదయాత్రను చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన నిర్వహించనున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పెద్ద కుమారుడే మోహిత్‌రెడ్డి. చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయంగా తండ్రికి అన్నీతానై మోహిత్‌రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో చెవిరెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలొచ్చాయి. తన ఆదేశాలకు అనుగుణంగా చెవిరెడ్డి గడపగడపకూ వెళ్లలేదని నేరుగా ఎమ్మెల్యేతోనే జగన్ అన్న విషయం తెలిసిందే. నిజానికి జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో చెవిరెడ్డి ఒకడిగా గుర్తింపు వుంది. అయితే ఆదేశాలను అమలు విషయానికి వచ్చే సరికి, వ్యక్తిగత సంబంధబాంధవ్యాలను పక్కన పెడతారనేందుకు చెవిరెడ్డిపై ఆగ్రహాన్ని ఇటీవల కాలంలో ఉదాహరణగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టనుండడం విశేషం. ఈ పాదయాత్రను తిరుపతి రూరల్ మండలంలోని మంగళం జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో ఈ నెల 7న సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరు కానున్నారు.
చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 205 రోజుల పాటు కాలి నడకన ఇంటింటికి మోహిత్‌రెడ్డి వెళ్లనున్నారు. 1600 కిలో మీటర్లు ఆయన నడక సాగిస్తారు. ఆరు మండలాల్లో 1లక్షా 42 వేల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. అలాగే జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించి, మరోసారి ఆశీస్సులు కోరనున్నారు. సౌమ్యుడిగా పేరొందిన మోహిత్‌రెడ్డికి ఈ పాదయాత్ర రాజకీయ ఉన్నతికి తోడ్పతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.