కేసీఆర్ జాతీయ పార్టీకి క్లైమాక్స్ 2024కు ముందే!

జాతీయ పార్టీ కావాల‌ని అన్ని పార్టీల‌కూ ఉండొచ్చు! ఆ మేర‌కు ఏ పార్టీ అయినా త‌మ‌ది జాతీయ పార్టీ అని ప్ర‌క‌టించుకోవ‌చ్చు! అడిగే నాథుడైతే ఉండ‌రు. అయితే అధికారికంగా జాతీయ పార్టీ అనిపించుకోవాలంటే మాత్రం…

జాతీయ పార్టీ కావాల‌ని అన్ని పార్టీల‌కూ ఉండొచ్చు! ఆ మేర‌కు ఏ పార్టీ అయినా త‌మ‌ది జాతీయ పార్టీ అని ప్ర‌క‌టించుకోవ‌చ్చు! అడిగే నాథుడైతే ఉండ‌రు. అయితే అధికారికంగా జాతీయ పార్టీ అనిపించుకోవాలంటే మాత్రం ఎన్నిక‌ల క‌మిష‌న్ నియ‌మాలున్నాయి. ఆ పార్టీకి దేశ వ్యాప్తంగా ఒకే గుర్తు ల‌భించాల‌న్నా..  ఓట్ల ప‌ర్సెంటేజ్ గురించి ప‌క్కా లెక్క‌లున్నాయి. 

అలాంటి లెక్క‌ల‌కు రీచ్ అయితే ఏ పార్టీకి అయినా జాతీయ గుర్తింపును ఇస్తుంది సీఈసీ. ఒక ద‌శ‌లో అలాంటి స్థాయికి చేర‌కుని, ఆ త‌ర్వాత జాతీయ పార్టీ హోదాను కోల్పోయిన పార్టీలు కూడా ఉన్నాయి. యూపీకి చెందిన బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీ, స‌మాజ్ వాదీ పార్టీల ప‌రిస్థితి ఇదే!

వాటి సంగ‌త‌లా ఉంటే.. ఇప్ప‌టికే జాతీయ పార్టీ అంటున్న కేసీఆర్ కు అస‌లు ప‌రీక్ష 2024లో ఉండ‌వ‌చ్చు. దేశ వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌రిగే సంవ‌త్స‌రం అది. ఆ లోపు కేసీఆర్ త‌న జాతీయ పార్టీని ఏ మేర‌కు విస్త‌రిస్తారో చూడాల్సి ఉంది. అయితే లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంవ‌త్స‌రం క‌న్నా మునుపే కేసీఆర్ కు ఒక క‌ఠిన పరీక్ష ఉంది. ఆ ప‌రీక్ష‌లో మెరుగ్గా పాస్ అయితే మాత్ర‌మే ఆయ‌న జాతీయ పార్టీని ఎవ‌రైనా ప‌ట్టించుకునే దాఖ‌లాలున్నాయి. 

కేసీఆర్ జాతీయ పార్టీ 2024 ఎన్నిక‌ల బ‌రిలో దేశంలోని ఎన్ని సీట్ల‌లో నిలుస్తుందో కానీ.. అంత‌క‌న్నా మునుపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్ని సీట్ల‌లో నెగ్గుతుంద‌నేది ఆ పార్టీకి పెద్ద ప‌రీక్ష‌. క్రితం సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నెగ్గిన స్థాయి విజ‌యం గ‌నుక న‌మోదు చేస్తే.. అప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీకి బ‌య‌ట కొద్దో గొప్పో ఊపు ఉండ‌వ‌చ్చు! క‌నీసం దాన్నొక పార్టీగా అంతా గుర్తిస్తారు. అలా కాకుండా… తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బోటాబోటీ మెజారిటీతో నెగ్గినా, మెజారిటీకి ద‌రిదాపుల్లోకి వ‌చ్చి ఆ పార్టీ ఆగిపోయినా… అంతే సంగ‌తులు!

కేసీఆర్ పెట్టుకోక‌పోయినా.. లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల క‌న్నా మునుపే.. కేసీఆర్ రాజ‌కీయానికి కీల‌క ప‌రీక్ష ఉంది. అలాగే.. లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మునుపే క‌ర్ణాట‌క వంటి రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నిక‌లున్నాయి. మొత్తానికి జాతీయ పార్టీ అంటున్న కేసీఆర్ కు ఇక నుంచి ఇలాంటి స‌వాళ్లు బోలెడన్ని ఉంటాయి. త‌ను సీరియ‌స్ ప్లేయ‌ర్ అనిపించుకోవాలంటే ఇలాంటి వాటిని ఎదుర్కొని విలీనాల‌తో ముందుకెళ్లాలి మ‌రి!