భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేతగా కేసీఆర్ పార్టీ విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ముందస్తుగా కర్నాటక, మహారాష్ట్రలో ప్రవేశించనున్నారు. ఆ తర్వాతే తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా అడుగు పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఏపీలో రాజకీయంగా, వ్యక్తిగతంగా కేసీఆర్‌కు మంచి సంబంధాలున్నాయి. అయితే బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటో తెలియకుండా, మరీ ముఖ్యంగా మోదీ, అమిత్‌షాతో యుద్ధం చేస్తున్న కేసీఆర్ వెంట నడవడానికి ధైర్యం కావాలి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌పై కేసీఆర్ వ్యూహాత్మకంగా నడవడానికి నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇందులో భాగంగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో కలిసి రాజకీయంగా బలపడేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆప్ పార్టీపై జనంలో ఓ క్రేజ్ వుంది. దీన్ని సొమ్ము చేసుకోడానికి కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.
నీతి, నిజాయతీ, పారదర్శకతకు ఆప్ పరిపాలనను రోల్ మోడల్‌గా జనం చూస్తున్నారు. ఆప్ పరిపాలనా రీతిపై విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మేధావులు ఆకర్షితులవుతున్నారు. ఇదే అదునుగా భావించిన కేసీఆర్…ఆప్‌తో కలిసి ఏపీలో అడుగు పెట్టాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే పార్టీ విస్తరణలో భాగంగా దక్షిణాదిలో ఆప్‌తో కలిసి రాజకీయ ప్రయాణం సాగించడంపై కేజ్రీవాల్‌తో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆప్‌తో కలిసి ఏపీలో కేసీఆర్ అడుగు పెట్టడం సానుకూల అంశంగా భావించొచ్చు.
ఏపీ వ్యతిరేక నాయకుడిగా ప్రజల మనసుల్లో నుంచి తనపై నెగెటివిటీని పోగొట్టేందుకు కేసీఆర్ ఏవో మాయమాటలు తప్పక చెబుతారు. ప్రజల్ని తన వైపు తిప్పుకునే చతురత కేసీఆర్‌లో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆప్‌తో కలిసి వస్తే మాత్రం టీడీపీకి భారీ దెబ్బ అని చెప్పక తప్పదు. చంద్రబాబును దెబ్బ తీయాలని కేసీఆర్ మనసులో బలమైన కోరిక వుంటే మాత్రం …కేజ్రీవాల్‌తో కలిసి ప్రయాణించడమే సరైన మార్గంగా చెప్పొచ్చు.