ఏపీ ప్ర‌భుత్వం ప‌డిపోతుంద‌ని ప‌నికిమాలిన జోస్యం!

తిరుప‌తి మాజీ ఎంపీ చింతామోహ‌న్ ఎప్పుడెలా మాట్లాడుతారో ఆయ‌న‌కే తెలియదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామ‌రూపాల్లేకుండా పోయినా, ఆయ‌న మాత్రం అందులోనే ఉన్నారు. ఎందుకంటే ఆయ‌న్ను భ‌రించ‌గ‌లిగే రాజ‌కీయ పార్టీలో ఏపీలో లేదు. మీడియాకు…

తిరుప‌తి మాజీ ఎంపీ చింతామోహ‌న్ ఎప్పుడెలా మాట్లాడుతారో ఆయ‌న‌కే తెలియదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామ‌రూపాల్లేకుండా పోయినా, ఆయ‌న మాత్రం అందులోనే ఉన్నారు. ఎందుకంటే ఆయ‌న్ను భ‌రించ‌గ‌లిగే రాజ‌కీయ పార్టీలో ఏపీలో లేదు. మీడియాకు సంచ‌ల‌న‌మే త‌ప్ప‌, వాస్త‌వాల‌తో ప‌ని ఉండ‌ద‌ని ఆయ‌నకు బాగా తెలుసు. ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీపై ఘాటు విమ‌ర్శ‌లు, సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తే, ప్ర‌చురించ‌డానికి, ప్ర‌సారం చేయ‌డానికి మెజార్టీ మీడియా సిద్ధంగా ఉంద‌ని ఆయ‌న గ్ర‌హించారు.

అందుకే ఆయ‌న ఇవాళ మీడియా ముందుకొచ్చి, తానింకా యాక్టీవ్‌గా ఉన్నాన‌నే సంకేతాలు ఇచ్చారు. వంద రోజుల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌డిపోతుంద‌ని ఆయ‌న తేల్చేశారు. కేసులు, ఆర్థిక , రాజ‌కీయ కార‌ణాల‌తో ఏపీ స‌ర్కార్ చిక్కుల్లో వుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఒక‌వైపు త‌న మిత్రుడి కొడుకు వైఎస్ జ‌గ‌న్ సీఎం అయ్యాడ‌ని సంతోషించానంటూనే, మ‌రోవైపు శాప‌నార్థాలు పెట్ట‌డం చింతా మోహ‌న్‌కే చెల్లింది. వైసీపీకి వెళ్లిన కాంగ్రెస్ నాయకులంతా తిరిగి సొంత పార్టీలోకి రావాలని ఆయ‌న‌ పిలుపునిచ్చారు. రానున్న‌ ఎన్నికలలో ‌కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయ‌న అన్నారు. చింత చచ్చినా పులుపు చావ‌లేద‌న్న చందంగా చింతా మోహ‌న్ మాట‌లున్నాయి. కాంగ్రెస్ పార్టీ మ‌ట్టికొట్టుకుపోయినా, ఇంకా మాట‌ల్లో అహంకారం, పొగ‌రు మాత్రం త‌గ్గ‌లేద‌నే విమ‌ర్శ‌ల‌కు చింతా తాజా వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం.

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి వ్య‌తిరేకంగా చింతా మోహ‌న్ రాజ‌కీయాలు చేశారు. నిజంగా మిత్రుడి కుమారుడ‌నే భావ‌నే వుంటే… జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఇలాంటి విమ‌ర్శ‌లు చేసేవారు కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచేందుకు చింతా మోహ‌న్ నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డం ఇదేం కొత్త‌కాదు. ఎందుకంటే అది ఆయ‌న నైజం. అయితే వైఎస్ జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రేం మాట్లాడినా మైకు ఇవ్వ‌డానికి సిద్ధంగా మీడియా ఉండడాన్ని ఆయ‌న ఇలా వాడుకున్నారు.