టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ముగింపు ప్రసంగంలో తనదైన శైలిలో చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఉండాల్సిన చోట చిప్ లేదని వెటకరించారు.
రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ సమావేశంలో చంద్రబాబు తన వేలికున్న చిప్ గురించి పార్టీ శ్రేణులతో చెప్పారు. ఆరోగ్యానికి టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలని, తన ఆరోగ్య రహస్యం తన వేలికి ఉన్న ఉంగరమేనని ఆయన చెప్పారు.
ఉంగరానికి చిప్ ఉందన్నారు. దాన్ని కంప్యూటర్‌కు అనుసంధానం చేశానన్నారు. పల్స్‌రేటు, ఆరోగ్య పరిస్థితి, శరీరానికి కావాల్సిన ఆహార తదితరాలను అది సూచిస్తుందన్నారు. రోజూ తెల్లవారుజామునే చూసుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటానని ఆయన అన్నారు.
చిప్ గురించి బాబు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ చురకలంటించారు. ఈ మధ్య చంద్రబాబు రింగ్‌లో చిప్ ఉందని చెప్పడం చూశానన్నారు. చంద్రబాబులా రింగ్‌లోనో, మోకాళ్లలోనో, అరికాళ్లలోనో చిప్ ఉంటే సరిపోదని దెప్పి పొడిచారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేదన్నారు.
చిప్ వుండాల్సింది తలలో లేదా గుండెల్లో అని జగన్ వాటిని చూపి మరీ చెప్పారు. అందుకే చంద్రబాబుకు ప్రజల పట్ల మమకారం, ప్రేమ ఏమాత్రం లేవన్నారు.
పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు, దుష్టచతుష్టయం విధానమన్నారు. ప్రజలకు మంచి చేయకూడదన్నదే చంద్రబాబు అభిమతం అన్నారు. ఇదంతా చిప్ మహిమే అన్నట్టు జగన్ తీవ్ర విమర్శలు చేశారు. హృదయానికి, చిప్‌నకు ముడిపెట్టి జగన్ విమర్శలు చేయడం ఆకట్టుకుంది.