వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పీచ్ సూటిగా, ధాటిగా సాగింది. తనను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత జగన్ ముగింపు ప్రసంగం చేశారు. మరో రెండేళ్లలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం, తనపై కేసులు, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ సీటు నుంచి అంచెలంచెలుగా వైఎస్సార్‌సీపీ ఎదిగిన వైనాన్ని జగన్ ఆవిష్కరించారు. తనపై అన్యాయంగా అత్యున్నత దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి, కేసులు పెట్టి, జైలు పాలు చేసిన రాజకీయ పార్టీలకు నేడు పుట్టగతులు లేవన్నారు. 2014లో ఒక శాతం ఓట్ల తేడాతో ఓడి ప్రతిపక్షంలో కూర్చున్న విషయాన్ని గుర్తు చేశారు. 2014లో ఓడినా తనపై కుట్రలు, కుతంత్రాలు ఆపలేదన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నారన్నారు. వైసీపీ ఉండకూడదని ఎన్నో కుయుక్తులు పన్నారన్నారు. మన వద్ద ఎన్ని కొన్నారో 2019 ఎన్నికల్లో వాళ్లకు అన్ని సీట్లే వచ్చాయన్నారు.
మూడేళ్ల మన పాలనకు, గతంలో చంద్రబాబు పాలనను ఒక్కసారి పోల్చుకుని ఎవరిది ప్రజాపాలనో అర్థం చేసుకోవాలన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం నెరవేరుస్తున్నామని జగన్ అన్నారు. కానీ చంద్రబాబు పాలనలో 650 హామీలిచ్చి కేవలం 10 శాతం మాత్రమే అమలు చేశారన్నారు. చివరికి మ్యానిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌లో కనిపించకుండా చేసిన దయనీయమైన పాలన చంద్రబాబుదన్నారు.
నాయకుడిని, పార్టీ నడిపించేవి … క్యారెక్టర్, క్రెడిబులిటీ మాత్రమేనని తెలిపారు. గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసేందుకే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈనాడు, ఏబీఎన్, టీవీ5లకు మాత్రమే లబ్ధి కలుగుతుందని విమర్శించారు.
టీడీపీ దుష్టచతుష్టయం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రతి గామంలో వైసీపీ సోషల్ మీడియా బలంగా పని చేయాలని పిలుపునిచ్చారు. తనను ముందుకు నడిపించేది తన వెనుక మీరు (ప్రజలు) ఉన్నారనే గుండె ధైర్యమే అని అన్నారు.
తెలుగుదేశం పెత్తందార్ల పార్టీగా జగన్ అభివర్ణించారు. చంద్రబాబు సిద్ధాంతం వెన్నుపోటు అని అన్నారు. ఇవాళ రెండు సిద్ధాంతాలు, భావాల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. కౌరవులతో మనం యుద్ధం చేస్తున్నామన్నారు. వారిపై విజయం సాధించే అర్జునుడు ప్రజలే అన్నారు.
కుప్పంలో మున్సిపాల్టీని క్లీన్ స్వీప్ చేశామన్నారు. అలాగే చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలన్నింటిని వైఎస్సార్‌సీపీ దక్కించుకుందన్నారు. తమ ప్రభుత్వ మంచి పాలనకు కుప్పం ప్రజలు కూడా ఓటు వేశారన్నారు. రానున్న ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రతి ప్రజాప్రతినిధి, వైసీపీ కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు ప్రజల వద్దకెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని దిశానిర్దేశం చేశారు.
ప్రజలు సమస్యలను చెబితే వాటి పరిష్కారానికి నాయకులు కృషి చేయాలన్నారు. మొత్తానికి మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణుల్ని కదనానికి జగన్ సిద్ధం చేశారు.