మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో రామోజీరావు, శైలజాకిరణ్‌లను వైఎస్ జగన్ సర్కార్ వేటాడుతోంది. ఇంత కాలం మీడియాను అడ్డు పెట్టుకుని వైఎస్ కుటుంబంపై ఇష్టమొచ్చినట్టు రాతలు రాయించిన రామోజీరావు, ఇప్పుడు తన వద్దకు వచ్చే సరికి వేధిస్తున్నారని లబోదిబోమంటున్నారు. ఓదార్పు కోసం లోకంలో ఎవరెవరివో అభిప్రాయాలు తీసుకుని పేజీలకు పేజీలు ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ ద్వారా కస్టమర్ల నుంచి ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా డబ్బు వసూళ్లు చేయడంతో పాటు ఆ సొమ్మును ఇతర వ్యాపారాలకు మళ్లించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మొదలు పెట్టిన పోరాటాన్ని, కొన్ని నెలల క్రితం సీఎం వైఎస్ జగన్ అందిపుచ్చుకున్నారు. మార్గదర్శి అక్రమాలపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైలజను ఏపీ సీఐడీ అధికారులు వారి ఇంటికెళ్లి రెండు దఫాలు విచారించారు.
అయితే విచారణకు సరిగా సహకరించలేదని సీఐడీ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఏ1, ఏ2 నిందితులతో పాటు ఏ3 నిందితుడు శివరామకృష్ణకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. జూలై 5న విచారణ నిమిత్తం గుంటూరు సీఐడీ రీజనల్ కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ విచారణ కోసం ఇంటి గడప దాటని రామోజీరావు, ఆయన కోడలు శైలజకు ఇది షాకింగ్ పరిణామమే.
ఈ నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఊరట పొందితే తప్ప, విచారణను తప్పించుకోలేని పరిస్థితి. ఈ వయసులో తనకు కష్టాలు రావడంపై కాల మహిమో, జగన్ మహిమో అని ఇటీవల రామోజీరావు వాపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటే ఇదే కాబోలు. రాజకీయ, నట చక్రవర్తి ఎన్టీఆర్ మొదలుకుని ఎంతో మంది ప్రముఖులను ఏడ్పించిన రామోజీకి ఇవాళ్టి దుస్థితిపై కనీస సానుభూతి రాకపోవడం గమనార్హం.