జనసేనాని పవన్‌కల్యాణ్‌ను భ్రష్టు పట్టించడంలో ఎల్లో మీడియా సక్సెస్ అయ్యింది. పవన్‌ను సొంత వాళ్లు కూడా అసహ్యించుకునేలా చేయడంలో బాబు మీడియా అద్భుత నైపుణ్యం ప్రదర్శించింది. అయితే తనకు ఎల్లో మీడియా చేసిన ఘోర నష్టాన్ని గుర్తించే స్థితిలో పవన్‌కల్యాణ్ లేరు. ఇదే జనసేన విషాదం. పేజీలకు పేజీలు తాను చెప్పింది ప్రచురిస్తుంటే, ఉబ్బితబ్బిబ్బయ్యాడే తప్ప, ఆ రాతలు తన రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతాయని పవన్ గ్రహించలేకపోయారు.
పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి, అంతిమంగా జగనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఎల్లో మీడియా భయపడుతున్న సంగతి తెలిసింది. పవన్‌కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించినప్పటి నుంచి తానే సీఎం అవుతానని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని తనదైన సొంత పంథాలో పయనించడం మొదలు పెట్టారు. దీంతో ఆయనకు ప్రచారాన్ని ఎల్లో మీడియా తగ్గించింది.
ఈ నేపథ్యంలో పవన్‌తో బాబు కరపత్రాలుగా పిలుచుకునే ఎల్లో పత్రికలు పవన్‌ను ఇంటర్వ్యూ చేశాయి. కేవలం తన అభిమానుల కోసం సీఎం అవుతానని చెప్పానని ఆయన సెలవిచ్చారు. సీఎం కావాలంటే క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని, చాలా విషయాలపై అవగాహన పెంచుకోవాలని ఇలా తనదైన అవగాహనతో పవన్ చెప్పుకొచ్చారు. దీంతో జనసేన శ్రేణులు షాక్‌కు గురయ్యాయి.
పవన్‌కల్యాణ్ సీరియస్‌గా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించలేదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. తాజాగా మరోసారి పవన్ ప్రసంగిస్తూ జనసేనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. పవన్ పూటకో రకంగా మాట్లాడుతుండడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులకే కోపం వస్తున్న పరిస్థితి.
ఇక మిగిలిన పార్టీల నేతలు, కార్యకర్తల అభిప్రాయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికి పవన్ అభాసుపాలు అయ్యారని, ఎక్కడా చెల్లకుండా పోయారనే అంతర్మథనం మాత్రం జనసేనలో మొదలైంది. తాజాగా ఏ మొహం పెట్టుకుని తనకు ఒక అవకాశం ఇవ్వాలని పవన్ అడుగుతున్నారనే నిలదీతలను ఎదుర్కోవాల్సి వస్తోందని జనసేన నాయకులు వాపోతున్నారు.
ఆ రెండు పత్రికలు వ్యూహాత్మకంగా పవన్‌తో ఇంటర్వ్యూ చేసి, తాను సీఎం రేస్‌లో లేనని పవన్‌తో చెప్పించి, ఆయన్ను విజయవంతంగా భ్రష్టు పట్టించాయని జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం రేస్‌లో లేకపోతే, ఇక ఎవరి కోసం ఈ తిప్పలన్నీ అని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. నిలకడలేని రాజకీయాలతో పవన్‌ను ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడిందని జనసేనలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
పవన్‌ను చెల్లని రాజకీయ నాయకుడిగా తయారు చేసి, ఎల్లో మీడియా వికటాట్టహాసం చేస్తోందని జనసేన రగిలిపోతోంది.