జనసేన అధినేత, టాలీవుడ్ అగ్రహీరో పవన్‌కల్యాణ్ రోత రాజకీయాల్ని చూసి సామాన్యులు సైతం విసిగిపోతున్నారు. థూ, యాక్…కులాల మధ్య చిచ్చు రేపే ఇలాంటి వాళ్లు రాజకీయాలకు అనర్హులనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. మరోవైపు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మరుగున పడిపోయింది. కానీ లోకేశ్‌పై సానుభూతి వ్యక్తమవుతోంది.
వారాహి యాత్రలో పవన్ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ, రెచ్చ గొట్టే వ్యాఖ్యలతో మనుషుల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారనే విమర్శ వుంది. పవన్ రాజకీయ పంథా సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిందనే ఆందోళన నెలకుంది. ఇలాంటి వాళ్ల రాకతో రాజకీయాలతో పాటు సమాజం చాలా వేగంగా పాడవుతుందనే భయం మేధావులు, ఆలోచనాపరుల్లో ఉంది.
యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌తో పవన్‌ను పోల్చుతూ జనం చర్చించుకుంటున్నారు. లోకేశ్ ప్రసంగాల్లో వ్యక్తిగతంగా స్థానిక ప్రజాప్రతినిధులు, వారి అనుచరులపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. వాటికి ప్రత్యర్థులు కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు లోకేశ్ ఏదో ఒక పేరు పెట్టడం, ఆ తర్వాత రోజు ప్రత్యర్థులు ఆయనకు అదే రీతిలో సమాధాలు ఇస్తున్న తీరు సరదాగా సాగిపోతోంది.
పవన్‌తో పోల్చితే లోకేశ్ ఎంతో బెటర్ అని, ఎక్కడా సమాజానికి ప్రమాదకర రీతిలో కులాల గురించి లోకేశ్ విమర్శలు చేయడం లేదని పౌర సమాజం గుర్తు చేస్తోంది. అన్ని కులాల ఆదరణను చూరగొనేందుకు లోకేశ్ తన పాట్లు ఏవో పడుతున్నారు. అంతే తప్ప, పవన్ మాదిరిగా తాను కాపు అని ఎక్కడా చెప్పుకోవడం లేదు. ముఖ్యంగా బహిరంగ సభల్లో స్థానికంగా మెజార్టీ వర్గాల ఆదరణ పొందేందుకు తాము అధికారంలోకి వస్తే ఏం చేయనున్నారో వివరిస్తున్నారు.
కానీ పవన్‌కల్యాణ్ నోటికి అడ్డూ అదుపూ లేదు. సీఎం వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ నేతలపై ఇష్టానురీతిలో చెలరేగిపోతున్నారు. బాధ్యత లేకుండా కులప్రస్తావనలు తెస్తూ రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు. మళ్లీ తాను విశ్వనరుడని అంటూ నోటికి నరం లేకుండా అవాకులు చెవాకులు. బాబోయ్ పవన్ అని జడుసుకునేలా పవన్ వ్యవహరిస్తున్నారు. లోకేశ్ ఎంతో నయం అని ప్రత్యర్థులు కూడా మెచ్చుకునే పరిస్థితిని పవన్ తీసుకొచ్చారు.