రామోజీరావుకు సీఐడీ నోటీసులు!

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏపీ సీఐడీ దూకుడు ప్రదర్శిస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లతో ఏపీ సీఐడీ ఏ1గా రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైల‌జ‌ను పేర్కొంది. ఈ కేసులో ఈ…

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏపీ సీఐడీ దూకుడు ప్రదర్శిస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లతో ఏపీ సీఐడీ ఏ1గా రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైల‌జ‌ను పేర్కొంది. ఈ కేసులో ఈ ఉద‌యం శైల‌జ‌కు నోటీసులు పంపిన సీఐడీ.. తాజాగా రామోజీరావుకు సైతం నోటీసులు ఇచ్చింది. 

ఈ నెల 29, 31, ఏప్రిల్ 3, 6 తేదీల్లో విచార‌ణ‌కు అందుబాటులో ఉండాల‌ని సీఐడీ డీఎస్పీ ర‌వికూమార్ నోటీసులు జారీ చేశారు. ఇళ్లు లేదంటే ఆఫీస్‌లో విచారణకు అందుబాటులో ఉంటే సరిపోతుందని సీఐడీ పేర్కొంది. కాగా 1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం కేసులు నమోదు అయ్యాయి. 

మార్గదర్శిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని రామోజీరావు, ఆయన కోడలు శైలజ మీద పలు ఆరోపణలు రావ‌డంతో.. దర్యాప్తు చేసిన ఏపీ సీఐడీ అధికారులు సెక్షన్ 120 బి, 409, 420, 477 (a ) రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. అలాగే సెక్షన్ 5, ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్, ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం కింద కేసు నమోదు చేస్తూ ఏ 1 గా చెరుకూరి రామోజీరావు, ఏ 2 గా చెరుకూరి శైలజ, ఏ 3 గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదయ్యాయి.