టచ్‌లో ఉండడంపై ఆమె చెబితే అర్థాలు మారవా?

నలుగురు ఎమ్మెల్యేలు.. ఆల్రెడీ అధికార పార్టీలో లూప్ లైన్లో ఉన్నవారు, స్థానికంగా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ గెలిచే అవకాశం లేదని ముఖ్యమంత్రి గ్రహించబట్టి.. టికెట్ ఇవ్వబోను అని తేల్చిచెప్పేసిన వాళ్లు ఓట్లు వేస్తే…

నలుగురు ఎమ్మెల్యేలు.. ఆల్రెడీ అధికార పార్టీలో లూప్ లైన్లో ఉన్నవారు, స్థానికంగా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ గెలిచే అవకాశం లేదని ముఖ్యమంత్రి గ్రహించబట్టి.. టికెట్ ఇవ్వబోను అని తేల్చిచెప్పేసిన వాళ్లు ఓట్లు వేస్తే తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకుంది. ఇలాంటి నలుగురి బలాన్ని చూసుకుని.. చాలా పెద్ద పెద్ద మాటలతో ఇప్పుడు ప్రజలను తమ బలం గురించి నమ్మించాలని చూస్తోంది. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అనేకమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం లోకి రావాలని ఉత్సాహపడుతున్నారని చాటుకోవడం ఆ పార్టీ లక్ష్యం. పార్టీ నాయకులు అందరూ అదే తరహా డైలాగులు వల్లిస్తూ కాలం గడుపుతున్నారు. అందరూ మాట్లాడుతున్నప్పుడు తాను కూడా ఏదో ఒకటి చెప్పకపోతే బాగుండనది అనుకున్నారేమో.. తెదేపా మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ఓ డైలాగు విసిరారు. కానీ ఆమె డైలాగులు తప్పుడు అర్థాలు స్ఫురింపజేసేలా ఉన్నదని పార్టీ వారే నవ్వుకుంటూ ఉండడం విశేషం. 

టీడీపికి ఓటు వేసిన నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తీరును విమర్శిస్తూ, వైసీపీ నుంచి ఇంకా నలభై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని అనిత అన్నారు. టచ్ లో ఉండడం అంటే ఏమిటి? ఆమె ఏం అనుకుంటున్నారో బోధపడడం లేదని ఆ పార్టీ వారే వ్యాఖ్యానించుకుంటున్నారు. 

ఏదో నలుగురిని ప్రలోభపెట్టగలిగినంత మాత్రాన నలభై మంది యాభైమంది మాతో టచ్ లో ఉన్నారంటూ ఎగస్ట్రా డైలాగులు చెప్పే ధైర్యం నిజానికి చంద్రబాబునాయుడుకే లేదు. అలాంటిది తెలుగు మహిళ అధ్యక్షురాలు.. టచ్ లో ఉండడం గురించి అంత క్లియర్ గా సంఖ్య చెప్పడమే తమాషా.

అయినా 175 నియోజకవర్గాలున్న రాష్ట్ర రాజకీయాల గురించి 40 మంది ఎమ్మెల్యేలు వైసీపీనుంచి పార్టీ మారిపోతున్నారంటే దాని అర్థం ఏమిటి? ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతున్నట్టే. చంద్రబాబునాయుడు మహానుభావుడు అని నమ్మి వారంతా నిజంగానే పార్టీ మారుతున్నారేమో అని కాసేపు విశ్వసిద్దాం. 

అలాగైతే.. వారందరికీ చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో టికెట్లిచ్చి అవకాశం కల్పిస్తారా? సుమారు 45 నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి వచ్చే వారు వస్తే తప్ప.. అభ్యర్థులను పోటీకి మోహరించలేని స్థితిలో తెలుగుదేశం ఉన్నదా? వాళ్లందరికీ టికెట్లిచ్చి.. నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీని నియోజకవర్గాల్లో కాపాడుకుంటూ వస్తున్న సొంత పార్టీ నాయకుల నోళ్లలో మట్టి కొడతారా? అనే రకరకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.