అనంతపురం నగరానికి సినీ గ్లామర్ వచ్చింది. పలువురు వెండితెర సెలబ్రిటీలు అనంతపురానికి రావడంతో సందడి నెలకుంది. ‘మాదక ద్రవ్యాల నిషేధం, వాతావరణ కాలుష్యానికి ముఖ్య కారకమైన ప్లాస్టిక్ నిషేధం’పై అవగాహన కల్పించేందుకు ఆదివారం సినీతారల క్రికెట్ మ్యాచ్ నిర్వహించ తలపెట్టారు.
ఇందులో భాగంగా అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి పీటీసీ స్టేడియంలో టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్లో వరుణ్ సందేశ్, ఓంకార్, సంపూర్ణేష్ బాబు, సామ్రాట్ తదితరులతో పాటు మొత్తం 45 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. వీరిలో సినీ, జబర్దస్త్, బిగ్బాస్ నటీనటులు ఉండడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం కలుషితమై తీవ్ర ఉపద్రవాలు చోటు చేసుకుంటున్నాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో తీవ్ర అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక మాదక ద్రవ్యాల చెలామణి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
సమాజానికి హానికరంగా మారిన పర్యావరణ కాలుష్యం, ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడం, అలాగే నో డ్రగ్స్ నినాదంతో సినీ సెలబ్రిటీలు క్రికెట్ మ్యాచ్ ఆడడం అభినందనీయం. సమాజాన్ని చైతన్యపరిచే కార్యక్రమంలో తమ వంతు బాధ్యతగా పాల్గొనేందుకు అనంతపురం వెళ్లడం విశేషం.