ఏపీలో రాజకీయం బూతులమయమైంది. ఎవరికీ ఎవరూ తీసిపోవడం లేదు. బూతులకు బూతులే సమాధానం అని చెబుతున్నారు. ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో దాడి చేయడం అంటే అర్థం బూతులతో విరుచుకుపడడమే. కానీ అంతా శుద్ధపూసలమే అని తమ అసభ్య భాషను సమర్థించుకోవడం నాయకుల ప్రత్యేకత. ఇదిలా వుంటే ఓర్వలేకే చంద్రబాబు బూతులు తిడుతున్నారని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించడం విశేషం.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులున్నా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును ఆపలేదన్నారు. సామాజిక న్యాయం పాటించడంలో జగన్కు మరెవరూ సాటి రారన్నారు. పదవుల దగ్గరి నుంచి పథకాల అమలు వరకూ బడుగులకు సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నారన్నారు.
సంక్షేమ పథకాల అమలు చూసి ఓర్వలేకే చంద్రబాబు బూతులు తిడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయంగా చంద్రబాబు దిగజారి పోయారని అన్నారు. చంద్రబాబు కుట్రలు, కుయుక్తుల్ని జనం గమనిస్తున్నారన్నారు. దుష్ట చతుష్టయాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు రెచ్చిపోతున్నారని ఆయన విమర్శించారు.
ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేస్తున్న వ్యక్తి జగన్ అని అన్నారు. దళిత ద్రోహి చంద్రబాబు అని విమర్శించారు. ఎస్సీల్లో ఎవరైనా పుడతారా? అని గతంలో చంద్రబాబు ప్రశ్నించడాన్ని మేరుగ నాగార్జున గుర్తు చేశారు. రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. దళితుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మంత్రి మేరుగ తేల్చి చెప్పారు.