పురందేశ్వ‌రమ్మా.. మీరూ ధైర్యం చేయొచ్చు!

ఏపీ బీజేపీది ఓ దీన‌గాథ‌. టీడీపీ నేత‌లే బీజేపీలో కొన‌సాగుతున్నారు. టీడీపీకి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు క‌లిగించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఏపీ బీజేపీ నేత‌ల‌కు సిద్ధాంతాలు, ప‌ద్ధ‌తులేవీ వ‌ర్తించ‌వు. టీడీపీ కోసం బ‌హిరంగంగా ప‌ని చేసినా, చేస్తున్నా…

ఏపీ బీజేపీది ఓ దీన‌గాథ‌. టీడీపీ నేత‌లే బీజేపీలో కొన‌సాగుతున్నారు. టీడీపీకి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు క‌లిగించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఏపీ బీజేపీ నేత‌ల‌కు సిద్ధాంతాలు, ప‌ద్ధ‌తులేవీ వ‌ర్తించ‌వు. టీడీపీ కోసం బ‌హిరంగంగా ప‌ని చేసినా, చేస్తున్నా ఎవ‌రూ ఏమీ అన‌లేని ప‌రిస్థితి. బీజేపీని మ‌రెవ‌రో బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం లేదు. దానిక‌దే త‌న చ‌ర్య‌ల ద్వారా జ‌నాల్లో ప‌లుచ‌న అవుతోంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అండ ఏపీలో టీడీపీకి ఉండేందుకు ఆ పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తాజాగా చంద్ర‌బాబు అరెస్ట్ విష‌యంలో బీజేపీలో భిన్న‌స్వ‌రాలు వినిపిస్తున్నాయి. బాబు అరెస్ట్ అయిన వెంట‌నే మొట్ట‌మొద‌ట స్పందించిన పార్టీ ఏదైనా వుందంటే… ఏపీ బీజేపీనే. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబునాయుడు ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి మ‌రిది కావ‌డ‌మే. పార్టీ కంటే త‌న‌కు బంధుప్రీతే ఎక్కువ‌ని పురందేశ్వ‌రి చెప్ప‌క‌నే చెప్పారు. అయితే బీజేపీ అధిష్టానం చీవాట్లు పెట్ట‌డంతో కొంచెం త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తున్నారు.

ఇదిలా వుండ‌గా రాజ‌మండ్రిలో ఉన్న నారా భువ‌నేశ్వ‌రిని బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, టీడీపీ సానుభూతిప‌రుడైన సీఎం ర‌మేశ్‌నాయుడు స‌తీస‌మేతంగా వెళ్లి ప‌రామ‌ర్శించారు. టీడీపీపై త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను సీఎం ర‌మేశ్ దాచుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. సీఎం ర‌మేశ్ పేరుకు బీజేపీ అయిన‌ప్ప‌టికీ, ఆయ‌న మ‌న‌సంతా టీడీపీనే. సీఎం ర‌మేశ్ అన్న సీఎం సురేష్‌నాయుడు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టికెట్‌ను ఆశిస్తున్నారు. అన్న‌కు టీడీపీ టికెట్ ఇప్పించేందుకు సీఎం ర‌మేశ్ పావులు క‌దుపుతున్నారు.

గ‌తంలో టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులుగా బీజేపీలో న‌లుగురు చేరిన సంగ‌తి తెలిసిందే. వారిలో కొంద‌రు ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. సీఎం ర‌మేశ్ ప‌రామ‌ర్శ నేప‌థ్యంలో సుజ‌నాచౌద‌రి, టీజీ వెంక‌టేశ్‌, మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌దిత‌ర హార్డ్‌కోర్ టీడీపీ అభిమాన నాయ‌కులంతా భువ‌నేశ్వ‌రిని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లొచ్చు. 

ఎటూ సీఎం ర‌మేశ్‌పై చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితి ఉండ‌దు . హృద‌యం నిండా దిగులు పెట్టుకుని సొంత చెల్లెల్ని ప‌రామ‌ర్శించ‌కుండా ఎంత కాలమ‌ని వుంటారు పురందేశ్వ‌ర‌మ్మా… మీరు వెళ్లి వ‌స్తే ఒక ప‌నై పోతుంద‌నే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. రాజ‌కీయం, వ్య‌క్తిగ‌తం వేర్వేర‌ని, భ‌ర్త అరెస్ట్‌తో పుట్టెడు దుఃఖంలో ఉన్న చెల్లిని, త‌మ్ముడి కూతుర్ని ప‌రామ‌ర్శిస్తే బీజేపీ పెద్ద‌లు ఏమీ అన‌రంటూ నెటిజ‌న్లు ధైర్యం చెబుతున్నారు. మ‌రి పురందేశ్వ‌రి ధైర్యం చేస్తారో?  లేదో? చూడాలి!