విశాఖ పార్లమెంట్ సీటు అందరిదీ. అంటే నాన్ లోకల్ ది అన్న మాట. రాష్ట్రంలో ఉన్న వారేమిటి. ఇతర రాష్ట్రాలలో ఉన్న వారిని సైతం గెలిపించిన చరిత్ర విశాఖ ఎంపీ సీటుకు ఉంది. 1989లో కేరళకు చెందిన కాంగ్రెస్ మహిళా నేత ఉమను గెలిపించింది ఇదే విశాఖ నుంచి . నెల్లూరు నుంచి నేదురుమల్లి జనార్ధనరెడ్డి, టీ సుబ్బరామిరెడ్డి, బాపట్లకు చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి, ప్రకాశం జిల్లాకు చెందిన కంభంపాటి హరి బాబు ఎంపీలుగా గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు
విశాఖ సీటు నుంచి పోటీకి నాన్ లోకల్స్ మళ్లీ రేసులోకి దూసుకుని వస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా లోక్ సభ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి ముచ్చటగా మూడవసారి పోటీ పడాలని చూస్తున్నారు.
అనూహ్యంగా కడప జిల్లాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కన్ను విశాఖ ఎంపీ సీటు మీద పడింది అని ప్రచారం సాగుతోంది. సీఎం రమేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా విశాఖ వస్తున్నారు. ఈ మధ్య జరిగిన అమిత్ షా టూర్ లో ఆయన బిజీగా కనిపించారు.
పెద్దాయన అమిత్ షా చెవిలో తన పోటీ గురించి రమేష్ చెప్పారో లేదో తెలియదు కానీ విశాఖ రాజకీయ వర్గాలలో మాత్రం సీఎం రమేష్ విశాఖ నుంచి పోటీ చేయబోతున్నారు అని ప్రచారం సాగుతోంది. అంగబలం, అర్ధబలం దండీగా ఉన్న రమేష్ కి విశాఖ ఎంపీ సీటు బీజేపీ పెద్దలు ఇస్తారా అన్నది ఆలోచించాలి. ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చిన వారికి విశాఖ సీటు ఎలా ఇస్తారు అని అడిగే పరిస్థితి అయితే లేదు.
విశాఖ ఎపుడో నాన్ లోకల్స్ కి పెట్టని కోటగా మారింది. సీఎం రమేష్ కి కేంద్ర పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం వర్కౌట్ అయితే ఆయనే విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్ధి అని అంటున్నారు. టీడీపీతో పొత్తు ఉంటేనే రమేష్ పోటీ చేస్తారు అన్నదే కొసమెరుపు.