ఊహూ….వైసీపీ నేత వేడుకున్నా ద‌క్క‌ని ఊర‌ట‌!

వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వేడుకున్నా ఊర‌ట ల‌భించ‌లేదు. న్యాయ వ్య‌వ‌స్థ‌, న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై హైకోర్టు ఆదేశాల మేర‌కు సీబీఐ విచార‌ణ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా…

వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వేడుకున్నా ఊర‌ట ల‌భించ‌లేదు. న్యాయ వ్య‌వ‌స్థ‌, న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై హైకోర్టు ఆదేశాల మేర‌కు సీబీఐ విచార‌ణ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌పై సీబీఐ కేసు న‌మోదు చేసింది. ఈ నెల 20న విచార‌ణ‌కు రావాల‌ని సీబీఐ  పిటిషనర్‌కు 41ఏ కింద సీబీఐ నోటీసు ఇచ్చింది.

ఇతర నిందితులతో కలిపి విచారించేందుకు కస్టోడియల్‌ దర్యాప్తు అవసరమని కౌంటర్‌లో పేర్కొందని … ఆమంచి ఇతరులతో కలిసి కుట్రకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని, సీబీఐ పెట్టిన కేసును కొట్టివేయాలని సీనియ‌ర్ న్యాయ‌వాది ఎస్‌.నిరంజ‌న్‌రెడ్డి వాదించారు. సీబీఐ ద‌ర్యాప్తు స‌రైన రీతిలో సాగ‌డం లేద‌ని నిరంజ‌న్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యంపై న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నైనాల జ‌య‌సూర్య విచార‌ణ జ‌రిపారు.

సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టుల వెనుక కుట్ర వుందో లేదో తేల్చాల‌ని మాత్ర‌మే హైకోర్టు చెప్పింద‌ని, కుట్ర వుంద‌ని చెప్ప‌లేద‌ని న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డాక్ట‌ర్ సుధాక‌ర్ వ్య‌వ‌హారంపై హైకోర్టు సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించడం వ‌ల్ల న్యాయ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌లు న‌మ్మ‌కం కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని మాత్ర‌మే ఆమంచి అభిప్రాయం వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. 

న్యాయ వ్య‌వ‌స్థ‌, న్యాయ‌మూర్తుల‌కు దురుద్దేశాలు అంట‌గ‌డితే త‌ప్ప‌ని, స‌ద్విమ‌ర్శ‌లు త‌ప్పు కాద‌ని సుప్రీంకోర్టు సైతం చెప్పింద‌ని అన్నారు. కేసు కొట్టి వేయాల‌ని ఆమంచి త‌ర‌పు న్యాయ‌వాది కోరారు.

న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. తగిన సమయం లేద‌ని, సీబీఐ వాదనలు మరోరోజు వింటానని అన్నారు. ఆమంచి త‌ర‌పు న్యాయ‌వాది నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. పిటిషనర్‌ దేశం విడిచి వెళ్లరని.. 20న సీబీఐ ముందు హాజరవుతారని.. అరెస్టుతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్ద‌ని సీబీఐని ఆదేశించాల‌ని విన్న‌వించారు. అయితే ఆయ‌న విన్న‌పాన్ని హైకోర్టు ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

స‌హ‌జంగా ఇలాంటి కేసుల్లో సీఐడీ తొంద‌ర‌పాటు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని ఇదే హైకోర్టు అనేక ఆదేశాలు ఇవ్వ‌డం చూశాం. కానీ ఆమంచి విష‌యంలో వాయిదా వేయ‌డం త‌ప్ప‌, అరెస్టుపై దాట‌వేత ధోర‌ణి ప్ర‌ద‌ర్శించ‌డంతో వైసీపీ నేత‌లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. త‌న‌కే ఎందుకిలా అని ఆయ‌న వాపోతున్నార‌ని స‌మాచారం. ఈ నెల 29కు హైకోర్టు కేసు వాయిదా వేసింది.