విశాఖ వేదికగా జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని సిగ్గు లేకుండా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ విరుచుకుపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నాటకలో 40 శాతం అవినీతి ఉందని జనం నమ్మడం వల్లే ఇటీవల ఓడించారన్నారు. దేశానికి బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, కర్నాటకలో మత రాజకీయాలు తీసుకురావడంతో ప్రజలు బుద్ధి చెప్పారని మండిపడ్డారు.
కర్నాటకలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నావా? అని అమిత్‌షాను ప్రశ్నించారు. అలాంటి మీరు అవినీతి గురించి మాట్లాడ్డమా? అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కై వేలాది కోట్లు కమిషన్ రూపంలో తీసుకున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్‌తో కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఆంధ్రాను అదానీకి దోచు పెడుతున్నారని విమర్శించారు. మీకు తెలియకుండానే అదానీకి జగన్ భూములు ఇచ్చారా? అని అమిత్ షాను ప్రశ్నించారు.
డ్రామాలు కట్టిపెట్టాలని అమిత్ షాకు రామకృష్ణ సూచించారు. ఆరోపణలపై కట్టుబడి వుంటే జగన్ ప్రభుత్వం అవినీతిపై విచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. అలాగే వివేకా హత్య కేసులో అమిత్ షా నేతృత్వంలోని సీబీఐ విచారణ జరపడం సిగ్గుగా లేదా? అని నిలదీశారు. పులివెందులలో ఎవరిని అడిగినా వివేకాను ఎవరు చంపారో చెబుతారన్నారు.
ఈ దేశానికి మీరు హోం మినిస్టర్ కదా… కొంచమైనా సిగ్గు, శరం ఉన్నాయా? అని ప్రశ్నించారు. సిగ్గులేని దద్దమ్మా మూడేళ్లు విచారణ చేస్తారా? అని విరుచుకుపడ్డారు. అబద్ధాల దద్దమ్మ ఈ దేశానికి హోంమినిస్టర్‌గా వుంటూ చెత్త ఉపన్యాసం ఇచ్చారని విమర్శించారు.