హైదరాబాద్ సరూర్నగర్లో అప్సర హత్యలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ప్రస్తుతం నిందితుడు సాయికృష్ణ జైల్లో వుంటున్నాడు. కూతురిని పోగొట్టుకున్న తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. సాయికృష్ణ వ్యవహారశైలిపై అప్సర తండ్రి శ్రీకర్ సంచలన ఆరోపణలు చేశారు. తన కుమార్తె అప్సరపై సాయికృష్ణ కుటుంబ సభ్యులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు.
ఆలయానికి వెళ్లిన తమ కుమార్తెను సాయికృష్ణ ట్రాప్ చేశారని ఆయన ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడన్నారు. తన భార్యతో విభేదాలున్నాయని, విడాకులు తీసుకున్న తర్వాత ఆరునెలల్లో అప్సరను పెళ్లి చేసుకుంటానని సాయికృష్ణ నమ్మబలికాడని ఆయన అన్నారు. తమ కుమార్తెను ప్రేమ పేరుతో వంచించిన సాయికృష్ణను పెళ్లి చేసుకోవాలని నిలదీసినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
చివరికి అప్సరను నమ్మించి గొంతుకోశాడని శ్రీకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా అప్సరను సాయికృష్ణ హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అప్సర, సాయికృష్ణ మధ్య రిలేషన్ ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతోనే అప్సరను సాయికృష్ణ అంతమొందించాడని పోలీసులు తెలిపారు. మరోవైపు తమ కుమార్తెదే తప్పన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని అప్సర తల్లిదండ్రులు వాపోవడం గమనార్హం.
సాయికృష్ణ తండ్రి తరచూ మీడియాతో మాట్లాడుతూ అప్సర కుటుంబంపై వ్యూహాత్మకంగా ఆరోపణలు చేస్తున్నారు. పెళ్లయిన తన కుమారుడు ఎంత మంది మహిళలతోనైనా సంబంధాలు పెట్టుకున్నా తప్పు లేదన్న రీతిలో ఆయన వాదన వుంది.