మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దూకుడు మీద ఉంటే, ప్రధాన ప్రత్యర్థి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు డీలా పడిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మరోవైపు వైసీపీలో విభేదాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో సమసిపోయాయి. కానీ టీడీపీలో చంద్రబాబు మాట వినే నాయకులు కొరవడ్డారు. అలాగని చంద్రబాబు గట్టి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసాతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మళ్లీ యాక్టీవ్ అయ్యారు. టికెట్‌పై స్పష్టమైన హామీతో పాటు తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్, ఇతరత్రా నేతల పెత్తనం ఉండదని జగన్ తేల్చి చెప్పారు. దీంతో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వాలంటీర్లు, గృహసారథులతో సమావేశాలు నిర్వహించారు. వైసీపీ గెలుపుకోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేయడం విశేషం.
మరోవైపు వైసీపీలోని అంతర్గత కలహాలపై మైలవరం టీడీపీ ఆశలు పెట్టుకుని వుండింది. తాజాగా వైసీపీలో అంతర్గత కలహాలకు సీఎం జగన్ ముగింపు పలికారు. ఇదే మైలవరం టీడీపీ విషయానికి వస్తే… మాజీ మంత్రి ఉమామహేశ్వరరావుకు సొంత పార్టీ నేతలు చుక్కలు చూపుతున్నారు. ఆయనకు టికెట్ ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వమని సొంత పార్టీ నేతలే హెచ్చరికలు పంపారు.
దీంతో దేవినేని లాంటి సీనియర్ నేతకు దిక్కుతోచని స్థితి. పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే చందంగా దేవినేని పరిస్థితి తయారైంది. రానున్న ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వరనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు వైసీపీలో విభేదాలకు జగన్ ముగింపు పలకడంతో వసంత కృష్ణప్రసాద్ ఊపు మీద ఉన్నారు.
టీడీపీలోని వర్గ విభేదాలను రాజకీయంగా సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారు. ఇటీవల తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పార్టీలో తనకు అడ్డంకులు తొలగడంతోనే ఆయన శ్రీవారి దర్శనానికి వచ్చారని సమాచారం. ఏది ఏమైనా మైలవరంలో మళ్లీ వైసీపీ జెండా ఎగుర వేయడానికి వసంత శరవేగంతో ముందుకు కదులుతున్నారు.