జనసేనాని పవన్‌కల్యాణ్ ఏపీలో తనకు అనుకూలమైన పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడం లేదు. దీంతో ఇతర పార్టీలు చొరవ చూపుతున్నాయి. నిజానికి ఏపీలో పవన్ ప్రధాన ఓటు బ్యాంక్ కాపు, బలిజ… వాటి అనుబంధ కులాలే. కొద్దోగొప్పో అభిమానులు. తనకు అభిమానులే ఓటు వేయరని పలు సందర్భాల్లో స్వయంగా పవన్ కల్యాణే చెప్పారు. ఈ నేపథ్యంలో తన ఓటు బ్యాంక్‌ను కూడా కాపాడుకోలేని దయనీయ స్థితి.
ఆంధ్రప్రదేశ్‌లో బీసీల తర్వాత అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గం కాపు, బలిజలే. పవన్ సామాజిక వర్గం అన్నమాట. కేవలం నాలుగైదు శాతం ఓటు బ్యాంక్ కలిగిన సామాజిక వర్గాలకు చెందిన నేతలు పాలకులయ్యారు. ఇదే విషయమై పవన్‌కల్యాణ్ కూడా పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. ఎంత సేపూ కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు తప్పితే, మిగిలిన వర్గాలకు అధికారం దక్కదా? అని ఆయన వాపోయారు. వారి కోసమే తానున్నానని గొప్పలు చెప్పారు. కానీ చేతలకు వచ్చే సరికి శూన్యం.
జనసేనను కనీసం ఆయన సొంత సామాజిక వర్గం నేతలే నమ్మలేని దుస్థితి. దీంతో ఆ సామాజిక వర్గంపై అన్ని పార్టీలు కన్నేశాయి. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కూడా కాపులను తమ వైపు తిప్పుకోడానికి ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. ఇక జగన్ సోషల్ ఇంజనీరింగ్‌లో ఆరితేరారు. చంద్రబాబు విషయానికి వస్తే… బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. మూడు రోజుల్లో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. పోనీ కన్నా లాంటి వాళ్లకు పవన్‌పై అభిమానం లేదా? అంటే ఉందనే సమాధానం వస్తోంది. కానీ రాజకీయంగా జనసేనపై కన్నాతో సహా కాపులెవరికీ నమ్మకం లేదు.
కేవలం కులాభిమానంతో జనసేనలోకి వెళితే గతంలో ప్రజారాజ్యం సమయంలో కాపులంతా దెబ్బతిన్నట్టుగా, మరోసారి నష్టపోతామని వారు అప్రమత్తంగా వున్నారు. మరోవైపు తోట చంద్రశేఖర్, పార్థసారథి లాంటి జనసేన ప్రముఖ నాయకులంతా బీఆర్ఎస్‌లో చేరిన పరిస్థితి. ఇలా ఎన్నికల సమయానికి ఎక్కడికక్కడ కాపు నేతలంతా సర్దుకోడానికి సిద్ధంగా ఉన్నారు. కాపులే కాదు, నాదెండ్ల మనోహర్ లాంటి కమ్మ నాయకుడు కూడా పవన్ వైఖరితో విసిగిపోయారనే వార్తలొస్తున్నాయి.
రానున్న ఎన్నికల్లో పవన్ నిర్ణయం ఏంటో స్పష్టంగా తెలిస్తే… ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో నాదెండ్ల ఉన్నారని తెలిసింది. స్థిరమైన, నమ్మకమైన రాజకీయాలు చేయకపోతే దగ్గర వాళ్లు కూడా దూరమయ్యే పరిస్థితి ఎదురవుతుందని పవన్ ఇంకా గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా ఆయన మేల్కొనేలోపు చుట్టూ ఎవరూ మిగలకపోవచ్చు. ఇదే రీతిలో రాజకీయ పంథా కొనసాగిస్తే మాత్రం… పవన్ వెంట చివరికి మిగిలేదెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.