మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు రాజకీయ భవిష్యత్‌పై భయం పట్టుకుంది. ముఖ్యంగా చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసైనా, ఈ దఫా మైలవరం టికెట్ దక్కించుకోవాలనే ఎత్తుగడ వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా అంటే టీడీపీ నేతలెవరికీ సరిపడదు. ఉమా అహంకారమే ఆయన్ను సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు దూరం చేసిందని అంటుంటారు.
మైలవరంలో ఉమాకు వ్యతిరేకంగా టీడీపీలో బలమైన వర్గం తయారైంది. వివిధ సర్వేల్లో ఉమాకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని సమాచారం. దీంతో దేవినేనికి టికెట్ ఇవ్వడం అనుమానమే అనే చర్చ టీడీపీలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉమాకు ప్రత్యామ్నాయంగా మరో నాయకుడి ఎంపికలో చంద్రబాబు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమాకు రాజకీయ భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది.
ఈ నేపథ్యంలో అసహనం, టికెట్ రాదనే భయం తదితర కారణాల నుంచే తనకు ప్రాణ అపాయం వుందనే సంచలన కామెంట్స్ ఉమా నుంచి వస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ చేపట్టిన బస్సుయాత్రలో మైలవరం నియోజకవర్గానికి చేరింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించడం గమనార్హం. తనను ఎప్పుడైనా తుద ముట్టించవచ్చని దేవినేని సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.
కొండపల్లిలో తన కారుపై బండరాయితో దాడి చేశారన్నారు. కారుడోర్ తీసి ఉంటే తనతో పాటు మరికొందరు చనిపోయే వారన్నారు. అలాగే పడవ మునిగినప్పుడు గోదారితల్లి తనను బతికించిందని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ అన్నీ చంద్రబాబు మనసు కరిగించేందుకే అని దేవినేని అంటే గిట్టని టీడీపీ నేతలు అంటున్నారు.
ఇలాగైనా టికెట్‌ను సాధించుకోవచ్చనే వ్యూహంతో దేవినేని సరికొత్త నాటకానికి తెరలేపారని అంటున్నారు. నిజంగా తనకు ఎవరి నుంచేనా ప్రాణాపాయం ఉంటే పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప, రాజకీయం కోసం సంచలన కామెంట్స్ దేనికని ప్రశ్నిస్తున్నారు.