ఆనంపై సోమిరెడ్డి సెటైర్లు!

త్వ‌ర‌లో టీడీపీ కండువా క‌ప్పుకోనున్న వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ప‌రోక్షంగా సెటైర్లు విసిరారు. ప‌దేప‌దే పార్టీలు మారే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి అంటే సోమిరెడ్డికి అస‌లు గిట్ట‌ద‌ని నెల్లూరు…

త్వ‌ర‌లో టీడీపీ కండువా క‌ప్పుకోనున్న వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ప‌రోక్షంగా సెటైర్లు విసిరారు. ప‌దేప‌దే పార్టీలు మారే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి అంటే సోమిరెడ్డికి అస‌లు గిట్ట‌ద‌ని నెల్లూరు జిల్లావాసులు చెబుతుంటారు. అయితే రాజ‌కీయ అవ‌స‌రాల నిమిత్తం చంద్ర‌బాబునాయుడు మాట‌ను కాద‌న‌లేక‌, ఆనం రాక‌ను బ‌హిరంగంగా సోమిరెడ్డి వ్య‌తిరేకించ‌ని విష‌యాన్ని ఆ జిల్లా ప్ర‌జానీకం గుర్తు చేస్తోంది.

తాజాగా కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డిని అడ్డు పెట్టుకుని సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి త‌న మ‌న‌సులో గూడుక‌ట్టుకున్న అసంతృప్తిని, ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

''ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం, ఏ రోటికాడ ఆ పాట పాడటం ప్రసన్నకుమార్ రెడ్డికి బాగా అలవాటే. ఎన్నికలు వచ్చే సమయానికి సర్వేలు చేయించుకొని పార్టీలు మారడం, గెలిచాక లెక్కలేసుకొని ప్రజల్ని దోచుకోవడంలో ప్రసన్నకుమార్ రెడ్డే ఘనుడు '' అని సోమిరెడ్డి ఆరోపించారు.

ఎన్నిక‌ల ముందు స‌ర్వేలు చేయించుకుని పార్టీలు మార‌డం, గెలిచాక లెక్క‌లేసుకుని ప్ర‌జ‌ల్ని దోచుకోవ‌డంలో ఘ‌నుడ‌ని ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిని ఉద్దేశించి చేసిన విమ‌ర్శ‌లుగా నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎందుకంటే ప్ర‌తి ఐదేళ్ల‌కో సారి పార్టీలు మార‌డం ఆనం రామనారాయ‌ణ‌రెడ్డికే చెల్లింద‌ని వారు అంటున్నారు. టీడీపీలో రాజకీయ ప్ర‌స్థానం ప్రారంభించి, ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసిన ఘ‌న‌త ఆనంకే ద‌క్కింది. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరి, వైఎస్సార్ శిష్యులుగా ఆనం బ్ర‌ద‌ర్స్ గుర్తింపు పొంది, ఆయ‌న కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్నారు. నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌ను శాసించారు.

2014లో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో టీడీపీలో చేరి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ల‌బ్ధి పొందారు. 2019కి వ‌చ్చే సరికి వైసీపీ పంచ‌న చేరిన వైనాన్ని సోమిరెడ్డి ప‌రోక్షంగా ప్ర‌స్తావించి చీవాట్లు పెట్టార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇదంతా త‌న స‌మీప బంధువైన ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి పేరుతో చేయ‌డం సోమిరెడ్డికే చెల్లింది.