చాలా ఏళ్ల క్రితం సంగతి. చిత్తూరు కలెక్టర్ బంగ్లాలో ఒక కష్టం వచ్చింది. కలెక్టర్ సతీమణికి వేరే పనేమి లేక, తమకి ఇంకా మంచి రోజులు రావాలని పూజలు, పునస్కారాలతో పాటు, జ్యోతిష్యుల్ని ఇంటికి పిలిచి దండిగా దక్షిణ ఇచ్చేది. డబ్బులు ఊరికే తీసుకోవడం ఇష్టం లేక వాళ్లు నోటికొచ్చింది చెప్పేవాళ్లు.
ఒకడు ఏం చెప్పాడంటే లేవగానే తెల్లమచ్చల నల్ల అవుని చూస్తే శుభం కలగడంతో పాటు, కలెక్టర్ గారు, కలెక్టర్లకే కలెక్టర్ అవుతాడని నమ్మకంగా చెప్పాడు. దాంతో ఆవిడ “ఎవరక్కడ” అని చప్పట్లు చరిచింది. అమ్మగారిని నమ్ముకుని అయ్యగారి దగ్గర మార్కులు కొట్టేసే కొందరు ఉద్యోగులు “జై మాతాజీ” అని హాజరయ్యారు. అవు భారాన్ని ఒక రెవెన్యూ ఉద్యోగి భుజాల మీద వేసుకున్నాడు.
అతని పేరు భూమయ్య, (అసలు పేరు ఎవరికీ గుర్తు లేదు). మన భూమిని మనకి ఎప్పటికీ చెందకుండా రికార్డులు మార్చగలిగే నేర్పరి. జిల్లాలో కోర్టులు, పోలీసు స్టేషన్లు సుభిక్షంగా ఉన్నాయంటే ఆయన ఒక ముఖ్య కారణం. ఆవుని ఏదో ఒక సంతలో తోలుకు రావచ్చు కానీ, కరెక్ట్‌గా తెల్ల మచ్చల నల్ల అవు ఎక్కడ దొరుకుతుంది? పొలం గట్లు మార్చవచ్చు, కానీ ఆవుని ఎలా పట్టుకోవడం? భటుల్ని సంతలన్నీ వెతికించారు. లాభం లేదు. చివరికి ఆవుకి పెయింట్ వేయాలనే ఆలోచన వచ్చింది కానీ, దొరికిపోతే కలెక్టరమ్మ కర్రతో చావబాదుతుంది. పులిలా వుండే కలెక్టరే, మియావ్ అని సౌండ్ చేయడం చెవులారా విన్నాడు.
చివరికి కాణిపాకం సమీపంలోని ఒక పల్లెలో బ్లాక్ అండ్ వైట్ అవు దొరికింది. యజమాని పేదవాడు, కానీ మొండివాడు. గోమాతని అమ్మేది లేదన్నాడు. వాడి అమాయకత్వానికి జాలిపడి, రాత్రికి ఇద్దరు దొంగల్ని పంపి, అవుని తెచ్చి కలెక్టర్ బంగ్లాలో కట్టేశారు. అమ్మవారు తెల్లారి లేచి మొగుని ముఖం కూడా చూడకుండా ఆవుని చూసి దండం పెట్టింది.
ఆవు పోగొట్టుకున్న పేదవాడు పిచ్చాడిలా సంతలన్నీ తిరిగాడు. చుట్టూ వూళ్లన్నీ వెతికాడు. పోలీస్ స్టేషన్‌కి వెళితే ఎస్ఐ రెండు రోజులు పగలబడి నవ్వి, మూడో రోజు కర్రతో తరుముకున్నాడు. పేదవాడు అంజనంతో వెతికాడు. చిలుక శాస్త్రం అడిగాడు. రెవెన్యూ ఉద్యోగిపై అనుమానం వచ్చింది కానీ, వాడి జోలికెళితే మిగిలిన నాలుగు ఆవుల్ని కూడా అమ్ముకోవాల్సి వస్తుందని భయపడి మౌనం వహించాడు.
ఇక్కడ బంగ్లాలో ఆవుకి రాచమర్యాదలు జరుగుతున్నాయి కానీ, మనశ్శాంతి లేదు. దండం పెట్టేవాళ్లు తప్ప, ప్రేమగా నిమిరేవాళ్లు లేరు. ప్రతిరోజూ పడిపోయిన పాత కొట్టం, పేద యజమాని గుర్తుకొచ్చేవాళ్లు. చిరుగుల బనియన్, లుంగీతో జీవించే యజమాని, కష్టసుఖాల్ని గంటల సేపు ఆవుతో చెప్పేవాడు. బంగ్లాలో ఎవరికీ కష్టాలూ, సుఖాలూ రెండూ ఉన్నట్టు లేవు.
వారం రోజులకే మొహంమొత్తి, తెగించి తాడు తెంపేసి ఆవు పారిపోయి, యజమానిని చేరింది. ఆవుని కౌగలించుకుని పసిపిల్లాడిలా ఏడ్చాడు.
తెల్లారి కలెక్టరమ్మ రుద్రకాళిలా మారింది. ఇద్దరు సెక్యూరిటీగార్డులు పారిపోయారు. రెవెన్యూ ఉద్యోగి మోషన్స్‌తో సిక్ లీవ్ పెట్టాడు. తర్వాత ఏం జరిగేదో కానీ అదే రోజు కలెక్టర్‌కి ట్రాన్స్ఫర్ వచ్చింది. తాము ఆక్రమించిన పేదల భూమికి అడ్డు తగిలాడన్న ఆరోపణలతో నాయకులు బదిలీ చేయించారు.
ఈ విషయాలన్నీ తెలిసినా, ఆధారాలు లేని వార్తలు రాయడం జర్నలిజం ధర్మం కాదు కాబట్టి (ఆ రోజుల్లో ధర్మం ఒంటిపాదం మీదైనా నడిచేది) రాయలేదు. ఇప్పుడైతే ఆధారాలు లేకపోతే అదే అసలైన వార్త. జర్నలిజం కూడా అప్డేట్ అయ్యింది.
ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చిందంటే కథల్ అనే సినిమా నెట్‌ప్లిక్స్‌లో చూశాను. ఎమ్మెల్యే ఇంట్లో రెండు పనస కాయలు మాయమయ్యాయి. అవి మామూలివి కాదు, విదేశీ జాతి. పనస ఊరగాయని ముఖ్యమంత్రికి పంపి మంత్రి పదవి కొట్టేయాలని ఎమ్మెల్యే ఆలోచన (ప్రజాస్వామ్యంలో సహజంగా పదవులు ఇలాగే వస్తాయి).
పనస దొంగల కోసం పోలీస్‌శాఖ రంగంలోకి దిగుతుంది. ఎస్పీ దగ్గరుండి విచారణ ప్రారంభిస్తారు. కొత్తకొత్త విషయాలు బయటికొస్తాయి. సిస్టమ్ మీద అద్భుతమైన సెటైర్.
జనాల్ని కొండ చిలువలు తినేసినా ఎవరికీ అక్కర్లేదు. నాయకుడి మీద ఈగ వాలినా అన్ని యంత్రాంగాలు కదిలి వస్తాయి.
చట్టాన్ని మ్యూట్‌లో పెట్టడమే రాజకీయం.
జీఆర్ మహర్షి