జనసేన పుండుపై బీజేపీ కారం చల్లింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి డిప్యూటేషన్‌ను పొడిగిస్తూ ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదముద్ర వేయడం జనసేనకు ఏ మాత్రం నచ్చలేదు. ధర్మారెడ్డి డిప్యూటేషన్‌ను మరో రెండేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ధర్మారెడ్డికి రెండేళ్ల పదవీ కాలం పొడిగించారని విమర్శించారు.
ధర్మారెడ్డి కొనసాగింపు విషయమై ఏపీ బీజేపీ నేతలకు ముందే తెలుసని జనసేన నేతలు అన్నారు. ఏపీ బీజేపీ నేతలకు ఢిల్లీలో విలువ లేదని వారు విమర్శించడం గమనార్హం. వైసీపీకి కేంద్ర ప్రభుత్వం దన్నుగా నిలవడాన్ని జనసేన జీర్ణించుకోలేకపోతోంది. కేంద్ర సర్వీసుల్లోని అధికారులకు ఏడేళ్లు డిప్యూటేషన్‌పై కొనసాగేందుకు నిబంధనలున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డి గత నెల 14 తేదీ నాటికి ఏడేళ్లు డిప్యూటేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్నారు.
ఇక ఆయన ఢిల్లీకి వెళతారని, లేదంటే కేంద్ర కేడర్‌కు రాజీనామా చేసి, రాష్ట్ర పరిధిలోకి వస్తారనే ప్రచారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయశాఖలోకి తీసుకున్నట్టు ఎల్లో మీడియా ప్రచారం చేసింది. అయితే అలాంటి ప్రచారంలో నిజం లేదని తాజా కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో తేలిపోయింది.
1991 కేడర్‌కు చెందిన ధర్మారెడ్డి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్ (ఐడీఈఎస్)కు ఎంపికయ్యారు. జగన్ ప్రభుత్వం రాగానే ఆయన్ను డిప్యూటేషన్‌పై తీసుకొచ్చి, టీటీడీ అదనపు ఈవోగా నియమించారు. ఈవో జవహర్‌రెడ్డి బదిలీతో ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయి ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ధర్మారెడ్డికి డిప్యూటేషన్ పొడిగింపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం నిజమైంది. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేన, తాను చెప్పినట్టు కేంద్రం నడుచుకుని జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందని ఆశించింది.
అయితే అలాంటివేవీ జరగకపోగా, స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తుండడం జనసేనకు నచ్చడం లేదు. అదే బీజేపీపై జనసేన ఆగ్రహానికి కారణం. ప్రస్తుతం ధర్మారెడ్డిని తిరిగి కొనసాగించడం జనసేన పుండుపై కారం చల్లినట్టైంది. ఈనెల 14 తర్వాత కేంద్ర ఉత్తర్వులపై కోర్టుకెళ్తామని జనసేన హెచ్చరించడం ఆ పార్టీ అసహనానికి నిదర్శనమని చెప్పొచ్చు.