ప్రపంచం చాలా చిన్నదై పోయింది. ప్రతివాడు అన్ని విషయాలపై అభిప్రాయాలు చెప్పేస్తున్నాడు. అయితే బాధ్యత గల పదవుల్లో వున్న వాళ్లు నోటి దూలతో మాట్లాడితే ఏం జరుగుతుందో బీజేపీకి ఇప్పటికే అర్థమైంది. ఆ పార్టీలోని చిన్నాచితకా నాయకులు మత విద్వేషంతో మైనార్టీలను కించపరచడం కొత్తేమీ కాదు.
ఇదంతా తమకి మైలేజీ అని బీజేపీ అగ్ర నాయకులు అనుకున్నారు. ఇప్పుడు నుపుర్ అనే అమ్మాయి అసలుకే మోసం తెచ్చి గల్ఫ్‌లో మన వాళ్ల భద్రతకి, మన ఎగుమతుల వ్యాపారానికి ఎసరు తెచ్చింది.
అధికార ప్రతినిధి నుపుర్‌ని సస్పెండ్ చేసి, ఆమె మాటల్ని ట్విటర్‌లో ప్రచారం చేసిన పార్టీ ఢిల్లీశాఖ మీడియా విభాగం అధిపతి నవీన్ జిందాల్‌ని బహిష్కరించి నష్ట నివారణ చేశారు కానీ, పూర్తిగా కాదు. ఇకపైన మైనార్టీల విషయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని మాత్రం అర్థమైంది.
ప్రపంచమంతా కోట్లలో భారతీయులున్నారు. ప్రతి దేశంలోనూ దౌత్య, వ్యాపార సంబంధాలున్నాయి. అజాగ్రత్తతో వ్యవహరిస్తే అక్కడున్న మనవాళ్లకి ఇబ్బందులు, బిలియన్ డాలర్ల డబ్బు ఆగిపోతుంది. మనకు అత్యధికంగా డబ్బు వచ్చే ఏడు దేశాల్లో ఐదు గల్ఫ్‌లోనే వున్నాయి. ఆ దేశాలన్నీ మనకు నిరసన తెలిపాయి. భారతీయ ఉత్పత్తులని బహిష్కరిస్తామని చెప్పాయి. ఇదే జరిగితే అంతంత మాత్రం ఉన్న మన ఆర్థిక వ్యవస్థకి ఇంకా దెబ్బ.
57 ముస్లిం దేశాల సమాఖ్య నిరసన తెలపడమే కాకుండా, భారత్‌లోని ముస్లింల భద్రతపై ఐరాసకి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో భారత్‌కి వ్యతిరేకంగా గల్ఫ్‌లో ప్రచారం తీవ్రంగా వుంది. ఈ దేశాల్లో 87 లక్షల మంది భారతీయులున్నారు. అత్యధికంగా కార్మికులు. వాళ్లకి రాజకీయాలు తెలియవు.
ఏటా వాళ్ల కష్టార్జితం 6.76 లక్షల కోట్లు ఇక్కడున్న కుటుంబాలకి అందుతుంది. అందరు కూడా బతకడం కోసం అప్పులు చేసి వెళ్లిన వాళ్లే. పరిపక్వత లేని కొందరు మూర్ఖుల వదరబోతుతనం ఇంత మందికి మనశ్శాంతిని కరువు చేస్తోంది.
పరస్పర అవసరాల వల్ల వెంటనే ఇబ్బందులు రాకపోవచ్చు కానీ, నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్లని కంట్రోల్ చేయకపోతే బీజేపీకి వచ్చే ప్రమాదం కంటే, గల్ఫ్ భారతీయులకి వచ్చే కష్టాలే ఎక్కువ.