పార్ట్ టైమ్ టీచర్లు, లెక్చరర్లు తెలుసు కానీ, పార్ట్ టైమ్ సైనికులేంటి? సైన్యం మీద ఖర్చు తగ్గించుకోడానికి కేంద్రానికి వచ్చిన ఐడియా ఇది. డిఫెన్స్ శాఖలో ఉన్న ఫైల్ ఆమోదం పొందితే సెప్టెంబర్ నుంచి రిక్రూట్‌మెంట్ ప్రారంభమవుతుంది. ఈ పథకం పేరు అగ్నిపథ్. దీంట్లో పనిచేసే సైనికుల్ని అగ్నివీరులంటారు. ఈ స్కీంని సింఫుల్‌గా టూర్ ఆఫ్ డ్యూటీ (TOD) అని కూడా అంటారు.
ఈ స్కీం కింద త్రివిధ దళాల్లో నాలుగేళ్లకు మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. దీని వల్ల పెన్షన్ బిల్లు తగ్గుతుంది. 2022-23 సైనిక బడ్జెట్ 5.25 లక్షల కోట్లు అయితే, దాంట్లో పెన్షన్లకి పోయేది 1.2 లక్షల కోట్లు.
18- 21 ఏళ్ల వయసుండి, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్హత వుంటే పార్ట్ టైమ్ సైనికులుగా చేరొచ్చు. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసే వీళ్లకి ప్రమోషన్లు ఉండవు. నాలుగేళ్ల సర్వీసులో ఆరు నెలల శిక్షణ వుంటుంది. అయితే జీతభత్యాలు మాత్రం మామూలు సైనికులకి ఉన్నంతే ఉంటాయి. తక్కువ వుండవు.
దీర్ఘకాలం సైనికులుగా పని చేయడం ఇష్టం లేని వాళ్లు ఈ పథకం కింద చేరొచ్చు. చేరిన వాళ్లలో 25 % మందిని మాత్రమే పర్మినెంట్ చేసే అవకాశం వుంది. నిజానికి ఒక సైనికుడు ఫరపెక్ట్‌గా తయారు కావాలంటే నాలుగేళ్లు పడుతుంది. ఏడాది ట్రైనింగ్ తర్వాత కూడా వాళ్లకి యూనిట్లలో శిక్షణ వుంటుంది.
అయితే మిలటరీలోనే చాలా మంది అధికారులకి ఇది నచ్చలేదు. కాల పరిమితి నాలుగేళ్ల వల్ల శిక్షణలో నాణ్యత వుండదని, సైనికుల్లో అంకిత భావం లోపిస్తుందని వాళ్ల అభిప్రాయం. నాలుగేళ్ల తర్వాత వాళ్లు సమాజానికి హాని కలిగించే కిరాయి సైనికులుగా మారితే ప్రమాదం అని వాళ్ల భావన.
అంతే కాకుండా సరైన శిక్షణ లేని వాడితో యుద్ధానికి వెళితే వాడు మిగతా సభ్యుల ప్రాణాల్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని అంటున్నారు.