ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల ముందు పొత్తు రచ్చ జరుగుతోంది. దీనంతటికి జనసేన, టీడీపీలే కారణం. జనసేనతో వన్‌సైడ్ లవ్‌లో ఉన్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో కొంటె కామెంట్ చేశారు. ఈ మాటకే జనసేనాని పవన్‌కల్యాణ్ మనసు పారేసుకున్నారు. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని టీడీపీకి జనసేనాని పవన్ పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీంతో రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరినట్టు, అధికారంలోకి వచ్చినట్టు జనసేన నేతలు ఊహల్లో విహరించారు. అయితే ప్రజాక్షేత్రంలో తమ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయనే సంకేతాలు వెలువడడంతో చంద్రబాబునాయుడు యూటర్న్ తీసుకున్నారు. పొత్తులపై తన మాటల్ని వక్రీకరించారని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు పవన్‌కల్యాణ్ రెండు రోజుల క్రితం ఆప్షన్లు పెట్టడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
జనసేనపై టీడీపీ తీవ్రస్థాయిలో దాడికి దిగింది. జనసేన అంటే ఏ మాత్రం గిట్టని అధికార వైసీపీ కూడా ఈ స్థాయిలో ఎప్పుడూ రాజకీయ దాడికి దిగలేదు. పచ్చిగా చెప్పాలంటే జనసేనను టీడీపీ ఎగిచ్చి ఎగిచ్చితంతోంది. ఓట్లు చీలనివ్వనని పవన్ వ్యాఖ్యలపై ఎల్లో చానల్ వేదికగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఓట్లు చీలాలంటే ముందు జనసేనకు పడాలి కదా అని జీవీరెడ్డి కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. 2014, 2019లలో పవన్‌కల్యాణ్ తగ్గిందేమీ లేదన్నారు. కేవలం బీజేపీ కోసం 2014లో పవన్‌కల్యాణ్ తమ కూటమికి మద్దతు పలికారనేది టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి వాదన. పదేపదే టీడీపీ కోసం తానేదో త్యాగం చేసినట్టు పవన్‌కల్యాణ్ మాట్లాడ్డం తమకు అవమానంగా ఉందని జీవీరెడ్డి మండిపడ్డారు. 16 స్థానాల్లో మాత్రమే జనసేనకు డిపాజిట్లు వచ్చాయని, పొత్తులో భాగంగా ఐదు పార్టీలు పోటీ చేసిన 159 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదంటూ చావగొట్టారు.
మరో కీలకమైన అంశం ఏంటంటే 81 స్థానాల్లో జనసేన, వాటి మిత్రపక్షాలకు కలిసి వచ్చిన ఓట్ల శాతం మూడు శాతం లోపేనని పవన్‌కల్యాణ్ పార్టీని దిగంబరంగా నిలబెట్టారు. అ లెక్కల్ని బట్టి ప్రజావ్యతిరేక ఓట్లు జనసేన, దాని మిత్రపక్షాల వైపు రాలేదని జీవీరెడ్డి వివరించారు. పవన్‌కల్యాణ్ చెబుతున్నట్టు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలేదెక్కడ? అని ఆయన నిలదీశారు. అసలు ఓట్లే లేనప్పుడు చీలే ప్రశ్న ఉత్పన్నమయ్యేదెక్కడ? అని జీవీ రెడ్డి ప్రశ్నకు జనసేన నుంచి సమాధానం లేకపోయింది.
వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై ఒంటికాలిపై లేచే తమను ఆ పార్టీ కూడా ఎప్పుడూ ఈ స్థాయిలో చావు దెబ్బ కొట్టలేదని జనసేన నాయకులు వాపోతున్నారు. జనసేన లేకపోతే తమ పార్టీ లేదనే రీతిలో ఆ పార్టీ నేతలు అవమానకర రీతిలో వ్యవహరిస్తుండడం వల్లే… నిజాలు మాట్లాడాల్సి వచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి జనసేనకు టీడీపీ చేతిలో వాయింపు మామూలుగా లేదు.