ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావులో రోజురోజుకూ ఫైర్ పెరుగుతోంది. అమరావతి పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తుండడంతో, మరోవైపు ఈ నెల 15న విశాఖ గర్జన తలపెట్టనున్న నేపథ్యంలో ధర్మాన వ్యూహాత్మకంగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసేలా ఆయన మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర కోసం రాజీనామా చేస్తామని మొట్టమొదట ఆయనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
మంచి విషయ పరిజ్ఞానం, సామాన్య ప్రజానీకానికి సులువగా అర్థమయ్యేలా చెప్పే నేర్పు మంత్రి ధర్మాన సొంతం. తన మేధస్సును మూడు రాజధానుల కోసం ఆయన ప్రయోగిస్తున్నారు. గతంలో అసెంబ్లీకి రాజధాని ఎంపిక హక్కులేదని హైకోర్టు తీర్పు ఇచ్చినపుడు, ఇదే ధర్మాన తీవ్రస్థాయిలో తన వ్యతిరేకతను ప్రదర్శించారు. అసలు చట్టసభ, న్యాయ వ్యవస్థల హక్కులు, బాధ్యతలు ఏంటో తెలుసుకోవాలని ఉందని, చర్చించేందుకు అసెంబ్లీని సమావేశ పరచాలని ఆయన స్పీకర్‌కు లేఖ రాయడం, అందుకు తగ్గట్ట సమావేశమైన సంగతి తెలిసిందే.
నాడు అసెంబ్లీ వేదికగా చట్టసభల ప్రాధాన్యతలపై ఆయన అద్భుత ప్రసంగం సాగించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఎంపిక కోసం గతంలో యూపీఏ ప్రభుత్వం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏపీ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న సమయంలోనే, మరోవైపు ప్రభుత్వం మంత్రి నారాయణ నేతృత్వంలో టీడీపీ ఎంపీలు, వ్యాపారస్తులతో మరో కమిటీని నెలకొల్పింది.
నారాయణ కమిటీ నివేదిక మేరకే టీడీపీ ప్రభుత్వం రాజధానిని ఎంపిక చేసిందన్నది వాస్తవం. ఇప్పుడు మూడు రాజధానుల అంశం తెరపైకి రావడంతో చంద్రబాబు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఇదే అదునుగా భావించిన ధర్మాన ఉత్తరాంధ్ర వాయిస్‌ను బలంగా వినిపిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
గత అనుభవాలతో ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలనేది ధర్మాన అభిప్రాయం. కొంత మంది చేతుల్లో ఉండే రాజధాని మనకు అవసరమా? అంటూ అమరావతిపై నిరసన వ్యక్తం చేశారు. విశాఖకు పరిపాలన రాజధాని వస్తే మీకు వచ్చిన నష్టమేంటి? అని ఆయన నిలదీశారు. విశాఖలో రాజధాని సెంటిమెంట్ లేదని అంటారా? అమరావతిలో సెంటిమెంట్ ఉంటే లోకేష్ ఎందుకు ఓడిపోయాడని ఆయన లేవనెత్తిన ప్రశ్న అందర్నీ ఆలోచింపజేస్తోంది.
ఉత్తరాంధ్ర ఆవేదనను, ఆక్రోశాన్ని ఆవిష్కరించడంలో ధర్మాన సక్సెస్ అయ్యారు. అయితే ధర్మాన ఆవేదనను ఉత్తరాంధ్ర ప్రాంతం సొంతం చేసుకుంటేనే వైసీపీకి లాభం. ఆ దిశగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాలి.