జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించి టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు వంశీ అత్యంత సన్నిహితుడైన విషయం తెలిసిందే. జూ.ఎన్టీఆర్ ఆప్తుడైన వంశీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీ ఏమన్నారో ఆయన మాటల్లోనే…
“జూనియర్ ఎన్టీఆర్ తన స్వయంకృషితో పైకి వచ్చారు. ఆయన్ను ఎవరూ పైకి తీసుకురాలేదు. అనేక అంతర్గత రహస్యాలున్నాయి. ఇవన్నీ చెబితే చాలా మంది నిద్రపోరు. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లితో సహా ఆయనకు సంబంధించి ఎవరీ పాత్ర లేదు. తను కష్టపడ్డారు. 2009లో టీడీపీ తరపున ప్రచారం చేశారు. వాడుకుని కరివేపాకులా వదిలేశారు. ఈ రోజు సినిమాలు చేసుకుంటూ తన కెరీర్‌ను చూసుకుంటున్నారు.
అలాంటి వ్యక్తిని అనవసరంగా విమర్శించడం, నాకు అవసరం వచ్చినపుడు నువ్వు ఎందుకు రాలేదని ప్రతిసారి అడుగుతారు. ఇంట్లో నాలుగు ఎలుకలు దూరితే… చంద్రబాబు ఇంటిని తగలబెట్టమని చెబుతారు. అమరావతితో జూనియర్ ఎన్టీఆర్‌కు ఏం సంబంధం? ఆయన ఎప్పుడైనా వచ్చి రైతుల్ని పొలం ఇమ్మన్నాడా? పొలం ఇవ్వడంలో ఆయన పాత్ర వుందా? ఏమీ లేదు కదా?
ప్రతి సమస్యకి ఆయన్ని లాగడం, ఇన్వాల్వ్ చేయడం ఏంటి? పవన్‌కల్యాణ్ ఉన్నాడు కదా? వీళ్లు అడిగినా, అడగకపోయినా స్పందిస్తాడు కదా? అని వల్లభనేని వంశీ తన మార్క్ విమర్శలతో టీడీపీని ఆడుకున్నారు. ఇదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్‌కు అండగా నిలిచారు. పనిలో పనిగా పవన్‌కల్యాణ్‌కు తలంటాడు.
చంద్రబాబు దత్త పుత్రుడిగా పవన్‌కల్యాణ్‌ను ప్రత్యర్థులు విమర్శించే సంగతి తెలిసిందే. ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టాననే మాటే తప్ప, ఆ పని చేసిందేమీ లేదు. ఇటీవల అమరావతి రైతుల పాదయాత్రకు దివంగత ఎన్టీఆర్ కుమారుడు మద్దతు ఇచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ కూడా అలా ఇవ్వాలంటూ వ్యూహాత్మకంగా డిమాండ్‌ను తెరపైకి తెచ్చి, ఆయన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వల్లభనేని వంశీ ఘాటైన స్పందనతో తిప్పి కొట్టడం విశేషం. మరీ ముఖ్యంగా అంతర్గత రహస్యాలు ఏమై వుంటాయి? నిద్ర ఎవరికి పట్టదనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.