బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భారతీయుడే కానీ ఆయన ప్రస్తుతం కెనడా సిటిజన్, ఆయనకు భారత పౌరసత్వం లేదు. ఇప్పుడే కాదు, చాన్నాళ్లుగా ఆయన భారత పౌరుడు కాదు. కెనడా పౌరసత్వంతో భారత్ లో ప్రవాస జీవితం గడుపుతున్నాడు.
ఆ మధ్య ప్రధాని నరేంద్రమోదీ ఇంటర్వ్యూ తర్వాత భారతీయులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ అక్షయ్ ఓ మెసేజ్ ఇవ్వడం, దానికి సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవడంతో ఈ వ్యవహారం బయటపడింది. భారత్ లో ఓటు హక్కు కూడా లేని అక్షయ్, ప్రజలకు ఓటింగ్ మీద క్లాస్ తీసుకోవడమేంటని కొంతమంది కామెంట్లు చేశారు.
అసలు కథ ఏంటి..?
అక్షయ్ కుమార్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో ఎదిగారు. ఒకరకంగా ఆయన బాగా లేట్ గా సక్సెస్ అయ్యారు. కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. దీంతో ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పి జీవితం కోసం ఏదైనా ఉద్యోగంలో చేరాలనుకున్నాడు. 1990లో కెనడాలోని తన స్నేహితుడి సహాయం కోరాడు. ఆ స్నేహితుడి సలహా ప్రకారమే కెనడా పౌరసత్వం తీసుకున్నాడు. అయితే అదే సమయంలో ఆయన భారత పౌరసత్వం వదులుకోవాల్సి వచ్చింది.
కానీ అనుకోకుండా అక్షయ్ సుడి తిరిగింది. కెనడా పౌరసత్వం తీసుకున్న తర్వాత ఆయనకు సక్సెస్ లు వచ్చాయి. ఇక ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది, కెనడాలో పనిచేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో అక్షయ్ భారత్ లోనే సినిమాల్లో బిజీ అయ్యారు.
సినిమాల్లో బిజీ అయినా కూడా అక్షయ్ కుమార్ పౌరసత్వం విషయంలో మాత్రం తాత్సారం చేశారు. ఆయన ఇంకా కెనడా పౌరసత్వంతోనే భారత్ లో ఉంటున్నారు. దీనిపై ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల కొత్త సినిమాల ప్రమోషన్లో అక్షయ్ తన పౌరసత్వంపై స్పందించారు.
భారతీయ పౌరసత్వం కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని, అది రాగానే కెనడా పౌరసత్వాన్ని వదులుకుంటానని చెప్పారు. కరోనా వల్ల తన పౌరసత్వం దరఖాస్తు కాస్త ఆలస్యమైందన, త్వరలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ విషయం సోషల్ మీడియాలో రచ్చగా మారిన తర్వాత విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ఇప్పటి వరకూ మనం కెనడా హీరో సినిమాలు చూసి సంబరపడ్డామా అని అంటున్నారు కొంతమంది నెటిజన్లు. కెనడా పౌరుడు అయినా కరోనా సమయంలో భారత హీరోల కంటే ఎక్కువ సాయం చేశాడని మరికొందరు అక్షయ్ ని మెచ్చుకుంటున్నారు.