జాంబీ డ్రగ్.. ఇది యమా డేంజర్

ఇన్నాళ్లూ మనం జాంబీ కథలు విన్నాం, జాంబీ సినిమాలు చూశాం. కానీ ఇది జాంబీ డ్రగ్. భారత్ లో ఎప్పుడైనా డ్రగ్స్ పట్టుబడితే కొకైన్, హెరాయిన్, ఎపిడ్రిన్ అనే పేర్లు వినపడతాయి. ఇకపై జాంబీ…

ఇన్నాళ్లూ మనం జాంబీ కథలు విన్నాం, జాంబీ సినిమాలు చూశాం. కానీ ఇది జాంబీ డ్రగ్. భారత్ లో ఎప్పుడైనా డ్రగ్స్ పట్టుబడితే కొకైన్, హెరాయిన్, ఎపిడ్రిన్ అనే పేర్లు వినపడతాయి. ఇకపై జాంబీ డ్రగ్ అనే పేరు కూడా వినపడితే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడిదే ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్న ఈ జాంబీ డ్రగ్.. మనుషుల్ని జాంబీలుగా మార్చే స్థాయిలో దుష్పరిణామాలను చూపిస్తుందట.

జాంబీ డ్రగ్ అంటే ఏంటి..?

ట్రాంక్, ట్రాంక్ డోప్, జాంబీ డ్రగ్.. వీటన్నిటికీ మూలం జిలా జైన్. ఈ జిలా జైన్ అనేది ఆవులు, గుర్రాల కోసం తయారు చేసిన ఔషధం. వాటికి నొప్పి తెలియకుండా చేసేందుకు, ఎక్కువసేపు నిద్రలోకి జారుకునేలా చేసేందుకు తక్కువ మోతాదులో దీన్ని ఉపయోగిస్తారు. ఇలాంటి ఔషధం మనుషులు తీసుకుంటే, అది కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. అదే జాంబీ డ్రగ్. దాని దుష్పరిణామాలు కూడా అలాగే ఉంటాయి.

జాంబీ డ్రగ్ తీసుకుంటే రోజుల తరబడి నిద్రలోకి జారుకుంటారు. ఒకవేళ మెలకువగా ఉంటే.. నడుస్తున్నా, కూర్చున్నా కునికిపాట్లు పడాల్సిందే. చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ పడిపోతూ నడుస్తుంటారు ఈ డ్రగ్ తీసుకున్నవాళ్లు. అందుకే దీనికి జాంబీ డ్రగ్ అనే పేరు పెట్టారు. ఇక హై-డోస్ తీసుకుంటే మాత్రం చర్మం కుళ్లిపోవడం గ్యారెంటీ. చర్మంపై మెల్లగా మొదలయ్యే దద్దుర్లు చివరకు మానిపోని పుండ్లుగా మారతాయి. శ్వాస సమస్యలు మొదలవుతాయి. చివరాఖరున ప్రాణం పోతుంది.

2021లో న్యూయార్క్ లో అధిక మోతాదులో జాంబీ డ్రగ్ తీసుకున్న 2,668 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఫిలడెల్ఫియా 2021లో ల్యాబ్-టెస్ట్ చేసిన డ్రగ్ శాంపిల్‌లో 90 శాతం జిలా జైన్‌ ఉందట. దీన్నే జాంబీ డ్రగ్ అంటారు. ఫిలడెల్ఫియా నుంచి శాన్ ఫ్రాన్సిస్కో, ఆ తర్వాత లాస్ ఏంజిలస్.. ఇలా జాంబీ డ్రగ్ వాడకం మెల్లగా విస్తరిస్తూ పోతోంది.