భారత్-పాక్ లవ్ స్టోరీ.. నేపాల్ లో పెళ్లి.. చివరికి..!

ఇదో విచిత్రమైన లవ్ స్టోరీ. భారతీయ యువకుడిని పెళ్లి చేసుకున్న ఓ పాకిస్తాన్ అమ్మాయి చివరకు పోలీసులకు చిక్కింది. అన్నీ అనుకున్నట్టు జరిగినా.. పాస్ పోర్ట్ కోసం చేసుకున్న దరఖాస్తు ఆ అమ్మాయిని పట్టించింది.…

ఇదో విచిత్రమైన లవ్ స్టోరీ. భారతీయ యువకుడిని పెళ్లి చేసుకున్న ఓ పాకిస్తాన్ అమ్మాయి చివరకు పోలీసులకు చిక్కింది. అన్నీ అనుకున్నట్టు జరిగినా.. పాస్ పోర్ట్ కోసం చేసుకున్న దరఖాస్తు ఆ అమ్మాయిని పట్టించింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆమెను పాకిస్తాన్ కి అప్పగించారు. ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే.. ఆ అమ్మాయి పూర్తిగా మోసపోకుండా బయటపడింది.

అతడి పేరు ములాయం సింగ్ యాదవ్. బెంగళూరులో సెక్యూరిటీ గార్డ్. సోషల్ మీడియాలో తానో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా బిల్డప్ ఇచ్చేవాడు. ఆ బిల్డప్ కి పాకిస్తాన్ లోని ఇక్రా అనే అమ్మాయి పడిపోయింది. ఆమె సింధ్ ప్రావిన్స్ లో నివాసం ఉండేది. సమీర్ అన్సారీ అనే పేరుతో ములాయం ఆమెకు ఊసులు చెప్పేవాడు.

ములాయం అలియాస్ అన్సారీపై ప్రేమ మరీ ఎక్కువై పెళ్లి చేసుకుని భారత్ లో సెటిలైపోదామని అనుకుంది ఇక్రా. ఇద్దరూ ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. గతేడాది సెప్టెంబర్ లో ఆమె దుబాయ్ మీదుగా నేపాల్ కి వచ్చింది. ములాయం సింగ్ యాదవ్ కూడా నేరుగా నేపాల్ వెళ్లాడు. ఆమెను పెళ్లాడాడు.

ఆ తర్వాత ఇద్దరూ ఉత్తర ప్రదేశ్ కి వచ్చారు. అక్కడే కాపురం పెట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ల్యాప్ టాప్ పట్టుకుని ఫోజులిచ్చేవాడు ములాయం సింగ్ అలియాస్ అన్సారీ. అప్పులు చేసి ఎలాగోలా నెట్టుకొచ్చేవాడు. ఇక్రా అనే పేరుని రావాగా మార్చి భార్యకు ఆధార్ కార్డ్ తయారు చేయించాడు. ఆమె పేరుమీద పాస్ పోర్ట్ కి కూడా అప్లై చేశాడు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్లో అసలు విషయం బయటపడింది.

పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మనోడి బండారం కూడా బయటపడింది. ములాయం సింగ్ యాదవ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాదని, కేవలం సెక్యూరిటీ గార్డ్ అని పోలీసులు ఆమెకు చెప్పారు. దీంతో ఇక్రా మోసపోయానని గ్రహించింది, అసలు విషయం పాకిస్తాన్ లోని పేరెంట్స్ చెప్పి బాధపడింది. చివరకు పోలీసులు ఆమెను వాఘా సరిహద్దుకి తీసుకెళ్లి పాకిస్తాన్ అధికారులకు అప్పగించారు. ఈ మోసపు ప్రేమకథ చివరకు అలా ముగిసింది.