చంద్రబాబు నాయుడు.. రెండు కళ్ళ సిద్ధాంతం పేరు చెప్పి తన పార్టీకి తానే గొయ్యి తవ్వి కప్పెట్టేసారు. ఆయన వ్యవహారం గమనించిన ఎవరికైనా సరే ఆయనది రెండుకళ్లు మాత్రమే కాదు.. రెండు నాలుకల ధోరణి అనే సంగతి బాగా అర్థమవుతుంది! ఆయన వేసే అడుగులను ఇంకా జాగ్రత్తగా గమనిస్తే.. ఆయన ప్రయాణం ఎప్పుడూ కూడా రెండు పడవల మీదనే సాగుతుంటుందని కూడా అర్థమవుతుంది.
ఇక వర్తమానం లోకి వస్తే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో మళ్లీ మైత్రీ బంధాన్ని కలిపేసుకుని.. 2024 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాలని చంద్రబాబు నాయుడు కోరిక! అందుకు పవన్ కళ్యాణ్ ను కూడా ఒక పావుగా వాడుకోవాలని ఆయన వ్యూహం! అయితే బిజెపి దగ్గరకు రానివ్వడం లేదు!! అయినాసరే, ఇటీవలి కాలంలో ఎన్నడూ ఆయన బిజెపికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనడం లేదు!
పవన్ కళ్యాణ్ తో వన్ సైడ్ లవ్ ఉందని అన్నట్లుగానే, బిజెపికి కూడా కన్ను గీటే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘వారితో పొత్తుల గురించి వ్యాఖ్యలు చేయను’’ అంటూ నర్మగర్భంగా సంకేతాలు ఇస్తుంటారు! అలాంటి చంద్రబాబు నాయుడును బిజెపిని భయంకరంగా ద్వేషించే పార్టీలన్నీ కలిసి నిర్వహిస్తున్న సమావేశానికి ఆహ్వానిస్తే ఆయన ఏం చేస్తారు? ఆ సమావేశానికి హాజరయ్యే ధైర్యం, దమ్ము ఆయనకు ఉంటాయా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
మోడీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి జట్టుగా తయారయ్యే ప్రయత్నాలు ఇప్పుడు బాగా ఊపందుకున్నాయి. ఇందుకోసం మమతా బెనర్జీ తన స్థాయిలో కొంతవరకు ప్రయత్నించారు. తర్వాత కేసీఆర్ కూడా తన వంతు ప్రయత్నం చేసి దేశమంతా తిరిగారు. ఇప్పుడు అదే పని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నెత్తికెత్తుకున్నారు. అందరినీ ఏకం చేయాలని అనుకుంటున్నారు.
ఈ క్రమంలోనే వారికి ఒక అవకాశం అంది వచ్చింది. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఈనెల 25వ తేదీన ఒక భారీ సభ నిర్వహించాలని ఐ ఎన్ ఎల్ డి పార్టీ నిర్ణయించింది. ఈ సభకు కీలక నాయకులందరినీ ఆహ్వానిస్తున్నారు.
మోడీ వ్యతిరేకత, బిజెపియేతర పార్టీలు అన్నవి మాత్రమే అర్హతలు.. అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ భారీ బహిరంగ సభను విపక్షాల ఐక్యతకు ఒక అనువైన వేదికగా మార్చుకోవాలని వారు తలపోస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు హాజరవుతున్న కీలక నాయకులలో నితీష్ కుమార్, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, ఫరూక్ అబ్దుల్లా వంటి వివిధ పార్టీల నేతలతోపాటు వామపక్ష నాయకులు కూడా ఉంటారు. ఇదే సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కూడా ఆహ్వానిస్తామని ఆ పార్టీ నేత అభయ చౌతాలా చెబుతున్నారు.
వారు ఆహ్వానిస్తారు సరే.. అందుకు ఒక కారణం ఉంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు మోడీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. నిందించారు.. తిట్టిపోశారు! చంద్రబాబు నాయుడులో బహుశా ఇప్పటికి కూడా అదే ఫైర్, అదే వ్యతిరేకత, అదే పౌరుషం ఉన్నాయనే భ్రమలో ఈ ఇతర రాష్ట్రాల నాయకులు ఉండవచ్చు గాక, కానీ బిజెపి వ్యతిరేక పార్టీల కూటమికి వేదిక చేయడం కోసం వారు నిర్వహిస్తున్న సభకు చంద్రబాబు హాజరు కావడం అనేది అనుమానమే, ఆయనకంత ధైర్యం ఉండదు.
అది కేవలం దివంగత నాయకుడికి జయంతి కార్యక్రమమే అయినప్పటికీ, బీజేపీ ఎక్కడ ఆగ్రహిస్తుందో అనే భయంతో చంద్రబాబు నాయుడు ఏదో ఒక సాకు చెప్పి సభకు దూరంగా ఉండిపోతారని విశ్లేషకులు భావిస్తున్నారు!