తెలుగుదేశం ప్రలోభాలా, ఎన్డీయే కూటమి వైపునుంచి వస్తున్న ఒత్తిడులా.. కారణాలు ఏమైనా కావొచ్చు గానీ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇచ్చిన ఒక చట్టవ్యతిరేకమైన ఆదేశం విషయంలో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు నిజాయితీకి గొడ్డలిపెట్టుగా, నిబంధనలను పాతర వేస్తూ ఆయన ఇచ్చిన మెమోను వెనక్కు తీసుకున్నారు.
ఏ మెమో ద్వారా అయితే.. అనుచితమైన మార్గాల్లో తెలుగుదేశానికి, ఆ కూటమి పార్టీలకు దొడ్డిదారిలో లాభం చేకూర్చాలని అనుకున్నారో.. ఆ దార్లలో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. వివాదాస్పద ఆదేశాల విషయంలో వెనక్కు తగ్గడం గమనార్హం.
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ దఫా తెలుగుదేశం పార్టీ ఒక అరాచకమైన దందాను సాగించింది. రాష్ట్రంంలో గత ఎన్నికల సమయంలో 2.9 లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి. అదే సమయంలో ఈ సంవత్సరం ఏకంగా 4.4 లక్షల వరకు పడ్డాయి. అంటే ఒకటిన్నర లక్షల పోస్టల్ బ్యాలెట్లు తేడా అన్నమాట.
జగన్ ప్రభుత్వం మీద ఉద్యోగుల్లో బీభత్సమైన వ్యతిరేకత ఉన్నదని అందువల్ల ఉద్యోగులంతా జగన్ కు వ్యతిరేకంగా వేశారని తెలుగుదేశం చాలా ప్రచారం చేసింది. నిజానికి పోస్టల్ బ్యాలెట్లలో అటెస్టింగ్ అధికారి సంతకం, స్టాంపు లేకుండా నకిలీ ఓట్లను భారీగా తెదేపా వేయించినట్లుగా ఆరోపణలున్నాయి. దాన్ని కవర్ చేయడానికి ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత కార్డు తెరపైకి తెచ్చారు.
అయితే అటెస్టింగ్ అధికారి స్టాంపు లేకుండా వేసిన వాటిని కూడా లెక్కించాలంటూ తెదేపా ఈసీపై ఒత్తిడితెచ్చింది. ప్రధానాధికారి మీనా కూడా దానికి అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చేశారు. అయితే.. ఇది కేవలం తెదేపాతో కుమ్మక్కు అయి చేసిన వ్యవహారమేనని ఆక్రోశం వెళ్లగక్కిన వైఎస్సార్సీపీ హైకోర్టు తలుపుతట్టింది.
అయితే హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉండగానే.. స్టాంపులేకుండా వేసిన పోస్టల్ బ్యాలెట్లు కూడా లెక్కించాలంటూ ఇచ్చిన మెమోను ఎన్నికల అధికారి వెనక్కు తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం.. చాలా స్పష్టంగా జారీచేసిన మార్గదర్శకాలను తుంగలో తొక్కేస్తూ ఇచ్చిన ఆదేశాలు.. ఖచ్చితంగా తెలుగుదేశానికి ఫేవర్ చేయడానికే అని ఈ చర్యతో తేలిపోతోంది. పిటిషన్ పై హైకోర్టులో తీర్పు రాకముందే.. విజయం సాధించినట్లు అయిందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.