ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ నెల 13న ఎన్నికలు ముగిశాయి. ఈ సందర్భంగా పల్నాడు, మరికొన్ని ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. అయితే ఎన్నికల తర్వాత కూడా గొడవలు మరింత పెరిగాయి. ముఖ్యంగా పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయ పక్షాలు పరస్పరం విధ్వంసానికి తెగబడ్డాయి.
ఎన్నికల అసమర్థతపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో ఎప్పుడూ ఎన్నికల తర్వాత గొడవలు జరగలేదని, ఈ దఫా ఈసీ విఫలం కావడం వల్లే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పౌర సమాజం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏపీ పరిణామాలపై సీరియస్ కావడం గమనార్హం. గొడవలను అరికట్టలేకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ సీఎస్ జవహర్‌రెడ్డి, హరీశ్‌కుమార్ గుప్తాకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఉన్నతాధికారులిద్దరినీ ఢిల్లీకి రావాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది. శాంతిభద్రతలను పరిరక్షించడం లేదనే కారణంతోనే డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేశారు.
రాజేంద్ర స్థానంలో హరీశ్‌కుమార్‌ను ఈసీ నియమించింది. అయినప్పటికీ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎస్పీలను మార్చిన జిల్లాల్లోనే గొడవలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, దీని వెనుక టీడీపీ ఉందని వైసీపీ విమర్శిస్తోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లా అంతటా 144 సెక్షన్ విధించారు. దుకాణాలు మూసి వేయించారు. రాజకీయ నాయకుల్ని గృహ నిర్బంధం చేశారు.