ఎన్డీయే కూటమి గెలుస్తుందని ఆ పార్టీల నాయకులు చెప్పుకుంటూ ఉన్నారు. విజయం ఎవరిదన్న సంగతి ఇంకా ఇరవైరోజుల తర్వాత తేలనుంది గానీ.. ఈలోగానే ఆ పార్టీల్లో నాయకులు మంత్రి పదవుల మీద కర్చీఫ్ లు వేసేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
పోలింగ్ నాడు ఇలా ఓటు వేయగానే అలా భార్యతో కలిసి వారణాసికి వెళ్లిన పవన్ కల్యాణ్ తాను ముందస్తుగానే ఇరిగేషన్ శాఖ మీద కర్చీఫ్ వేస్తున్నట్టుగా సంకేతాలు ఇచ్చేశారు. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసింది గనుక.. సాగునీటి కాలువల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలంటూ పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
కాలువలు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన మరమ్మతులు ప్రతి వేసవిలో చేపట్టాలి.. అయిదేళ్లుగా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. పూడికచేరిపోయింది. వేసవి ముగిసేలోగా ప్రభుత్వం ఈ పనులు పూర్తిచేయాలి.. అని పవన్ కల్యాణ్ ప్రకటనలో చెప్పారు.
ఇది కేవలం ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి కోసం పవన్ కల్యాణ్ కర్చీఫ్ వేసినట్టుగానే ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు. ఐదేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ అంటున్నారు- నిజమే అనుకుందాం! అంతకుముందు అయిదేళ్లు ప్రబుత్వం నడిపిన చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు కాలువల మరమ్మతులు చేయించారో పవన్ వద్ద లెక్కఉందా? మరి పదేళ్లుగా పార్టీ నడుపుతున్న పవన్ కల్యాణ్ గత ఏడాది లేదా అంతకుముందు ఏడాది ఇదే జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉండవచ్చు కదా!
ఇప్పుడు ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత.. ఇరవై రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగా.. ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేయడంలో అర్థముందా? అనేది ప్రశ్న!
ఇరిగేషన్ శాఖ అయితే ఎంత దండుకోవడానికైనా వాటంగా ఉంటుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టుంది. వారి ప్రభుత్వమే ఏర్పడితే.. పోలవరం కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని, నదుల అనుసంధానం పేరిట నిధులు తెచ్చుకుని.. యథేచ్ఛగా స్వాహా చేయవచ్చునని.. ఇతర మంత్రులలాగా తాను చంద్రబాబుకు వాటాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని పవన్ కల్యాణ్ ఆ శాఖను ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది.
ఏ విషయంలోనూ కూడా కించిత్తు సరైన జ్ఞానం ఉన్నదని ఏనాడూ నిరూపించుకోని పవన్ కల్యాణ్.. ఇరిగేషన్ శాఖ మీద పట్టుందని, కాలువలు వాటి నిర్వహణ గురించి తనకు బాగా తెలుసునని ఇండికేషన్ ఇవ్వడానికే ఇలా ప్రకటన ఇచ్చారని ప్రజలు భావిస్తున్నారు.