ఆయన మహారాజా వారు. వారి పూర్వీకులు సంస్థానాలను ఏలారు. ప్రజాస్వామ్యంలో కూడా ఆ కుటుంబీకులు మంత్రులుగా ఉంటూ వచ్చారు. అధికారం వారి వెంబడే ఎపుడూ ఉంటూ వచ్చింది. ఆయనే విజయనగరం పూసపాటి రాజావారు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. ఆయన 2019 ఎన్నికల్లో విజయనగరం నుంచి ఎంపీగా రెండవసారి పోటీ చేస్తే వైసీపీ చేతిలో ఓడిపోయారు.
అంతే కాదు ఆయన కుమార్తె తొలిసారిగా విజయనగరం అసెంబ్లీ నుంచి పోటీ పడితే ఆమెను కూడా వైసీపీ ప్రత్యర్ధి ఓడించేశారు. రాజకీయంగా ఈ ఓటములు వ్యక్తిగతంగా ఉంటే పార్టీ సైతం అధికారంలోకి రాలేదు. ఇక మాన్సాస్ సంస్థల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంది అన్న ఆగ్రహం ఆయనకు ఎటూ ఉంటుంది.
ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆయన తన కోపాన్ని అంతా జనాల మీద చూపించారు. ఇదేమి ఖర్మ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఖర్మను మోసుకొచ్చింది. నెత్తిన పెట్టుకుని తెచ్చింది ప్రజలే అంటూ డైరెక్ట్ గా వారిని నిందించారు. మీ వల్లే కదా ఇలాంటి పరిస్థితి వచ్చింది అని వారినే రాజావారు టార్గెట్ చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు వేస్తారు, తమకు నచ్చిన వారిని ఎన్నుకుంటారు. వారి ఓటు వారి అభిప్రాయం తప్పు అని నిందించే నైజం తెలుగుదేశం పార్టీ నేతల నుంచే ఎక్కువగా అంతా చూస్తున్నారు. చంద్రబాబు అయితే ఇప్పటికి అనేక సార్లు జనాలదే తప్పు అంటూ వచ్చారు. మమ్మల్ని ఓడించి తప్పు చేశారు అని ప్రజల మీద ఆయన చిర్రుబుర్రులు ఆడడం ఎన్నో సార్లు జరిగింది.
వెటరన్ పొలిటీషియన్ అశోక్ కూడా అదే మాట అంటున్నారు. అంటే ప్రజలకు ఆప్షన్ వెతుక్కుని ఓటేసే హక్కు లేదు అన్నట్లుగా ఈ రకంగా మాట్లాడుతున్నారా లేక ప్రజల వివేచన శంకించేలా మాట్లాడుతున్నారా అన్నదే ఆలోచించాల్సిన విషయం. రాజా వారు మరో మాట అన్నారు, ప్రజల సొమ్ము కొట్టేసి లూటీ చేసి జైలుకు వెళ్ళి వచ్చిన వారిని ఎన్నుకోవడమే ఖర్మ అని.
జగన్ కేసులు గౌరవ న్యాయస్థానంలో ఉన్నాయి. అవి విచారణ దశలో ఉన్నాయి. అయినా కానీ తీర్పు కోర్టు ఇవ్వకుండా అశోక్ వారే ఆవేశపడి నిందితుడిని దోషిని చేయడం ఏ విధంగా చూడాలో వారే చెప్పాలేమో. ఏపీలో అత్యాచారాలు పెరిగిపోయాయట. శాంతిభద్రతలు లేవుట. ఇలా చాలానే ఆరోపణలు చేసిన రాజావారు మరో మాట కూడా అన్నారు. విభజన హామీల సాధనలో వైసీపీ విఫలం అయింది అని.
విభజన హామీలలో అతి ముఖ్యమైన హామీ ప్రత్యేక హోదానే పాతిపెట్టేసిన తెలుగుదేశం వారు ఇపుడు వైసీపీ మీద ఇలా పడి ఏడవడం అంటే ఇంతకంటే వింత ఏముంది అనే అంతా అంటున్నారు. మొత్తానికి అశోక్ గజపతిరాజు చెప్పేది ఏంటి అంటే తెలుగుదేశాన్ని ఎన్నుకుంటే అది అదృష్టం అది కాక వేరే ఏ పార్టీని ఎన్నుకున్నా ఖర్మం. 2024 ఎన్నికల్లో జనాలు ఇచ్చే తీర్పు టీడీపీని అనుకూలంగా లేకపోతే అపుడేమిటి అంటారో తెలుగు తమ్ముళ్ళు అని సెటైర్లు పడుతున్నాయి.