తమ్ముడి ఆశలకు గండి కొడుతున్న బాబు?

విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తాను అని సీనియర్ నేత మాజీ మంత్రి గండి బాబ్జీ ఆశలు పెంచుకున్నారు. ఎక్కడో పెందుర్తిలో ఉన్న ఆయనను తీసుకుని వచ్చి సౌత్ ఇన్చార్జిగా నియమించారు.…

విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తాను అని సీనియర్ నేత మాజీ మంత్రి గండి బాబ్జీ ఆశలు పెంచుకున్నారు. ఎక్కడో పెందుర్తిలో ఉన్న ఆయనను తీసుకుని వచ్చి సౌత్ ఇన్చార్జిగా నియమించారు. గత రెండేళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అయితే తొలి జాబితాలోనే ఉండాల్సిన గండి బాబ్జీ పేరు కనిపించకపోయేసరికి ఆయన అనుచరులకు డౌట్ వచ్చింది. ఈ నేపధ్యంలో గండి బాబ్జీని హై కమాండ్ పిలిపించుకుని మంతనాలు జరిపింది. విశాఖ సౌత్ సీటుని వేరే వారికి ఇస్తారని ప్రచారం కూడా మొదలైంది.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ చైర్మన్ సీతం రాజు సుధకార్ పేరుని పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. ఈసారి బ్రాహ్మణులకు టికెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోందిట. చంద్రబాబు పార్టీ బాధ్యతలు చేపట్టాక ఆ సామాజికవర్గానికి సీట్లు ఇచ్చినది లేదు అన్న విమర్శలు ఉన్నాయి.

దాంతో విశాఖ సౌత్ లో ఎక్కువగా ఉన్న బ్రాహ్మణులను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు సుధాకర్ పేరుని పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. ఆయన క్యాండిడేట్ అయితే వైసీపీ అసంతృప్తి ఓట్లను కూడా లాగుతారు అని ఆలోచన ఉందిట.

ఈ పరిణామాల నేపధ్యంలో గండి బాబ్జీ ఆశలు ఆవిరి అవుతున్నాయని అంటున్నారు. జనసేన కూడా విశాఖ సౌత్ మీద కన్నేసింది అని అంటున్నారు. సర్వేలలో సుధాకర్ కి సానుకూలంగా రాకపోతే జనసేనకు ఈ సీటు పొత్తులలో కట్టబెడతారు అని కూడా అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే గండి బాబ్జీ వర్గంలో కలవరం రేగుతోంది.

గండి బాబ్జీ కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు. 2004లో కాంగ్రెస్ తరఫున పరవాడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో పెందుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. 2019లో టీడీపీలో చేరితే టికెట్ లేదు, ఇపుడు కూడా హ్యాండ్ ఇస్తారా అన్న ఆందోళన అయితే ఆయన వర్గంలో ఉంది.