కొణతాలకు పెరిగిన ప్రయారిటీ!

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ నేతలూ ఇవ్వని ప్రాధాన్యత మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణకు జనసేన ఇస్తోంది. ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అని ఒక సామెత ఉంది.…

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ నేతలూ ఇవ్వని ప్రాధాన్యత మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణకు జనసేన ఇస్తోంది. ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అని ఒక సామెత ఉంది. ఆ విధంగా చూసుకుంటే లేట్ గా అయినా లేటెస్ట్ గా కొణతాల పొలిటికల్ గా రీ యాక్టివ్ అయినా తొలి జాబితాలోనే సీటు పట్టేశారు

ఇపుడు తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లతో పాటు వేదిక మీద ప్రసంగం కూడా చేశారు. ఇదే విశాఖ జిల్లాకు చెందిన మరే నేతకూ ఆ ప్రయారిటీ దక్కలేదు. కొణతాల విషయంలో ఎవరూ ఏమీ అనలేని విధంగా జనసేన ఆయనకు ఇంతటి ప్రాధాన్యత ఇస్తోంది అని అంటున్నారు.

అనకాపల్లి టికెట్ కోసం ఎంతో కాలంగా ఎందరి మధ్యనో పోరు సాగుతూంటే సైలెంట్ గా కొణతాల ఆ సీటు అందుకున్నారు. ఇపుడు ఆయన్ని సమర్ధించాల్సిన పరిస్థితి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వంటి వారిది అయింది. అంతే కాదు జనసేనలో ఉన్న అసంతృప్తులు కూడా సర్దుకోవాల్సి వస్తోంది.

టీడీపీ వైసీపీ మళ్లీ టీడీపీ ఇలా అన్ని పార్టీలు మారిన మరో మాజీ మంత్రి కొణతాలకు రాజకీయంగా ప్రత్యర్ధి అయిన దాడి వీరభద్రరావు వంటి వారు ఇపుడు ఉమ్మడి కూటమికి పనిచేయాల్సి వస్తోంది అని అంటున్నారు. విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు కూడా చాలా మంది ఉన్నారు. సీనియర్లు మాజీ మంత్రులు ఉన్నారు.

వారెవరికీ దక్కని గౌరవం అయితే కొణతాలకు దక్కింది. కొణతాల ఈ విషయంలో అదృష్టవంతుడు అనే అంటున్నారు. పదిహేనేళ్ళుగా రాజకీయంగా అధికార పదవులు అందుకోని కొణతాలకు ఇపుడు అన్నీ కలసివస్తున్నాయని అంటున్నారు. రేపటి రోజున టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే కొణతాల మంత్రి అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. రాజకీయ అజ్ఞాతవాసం గత నాలుగున్నరేళ్లుగా చేస్తూ వచ్చిన కొణతాల దశ తిరిగిందని ఆయన అనుచరులు అంటూంటే ప్రత్యర్ధులు మాత్రం మౌనంగా అన్నీ చూడాల్సిన పరిస్థితి ఉంది.