విశాఖ మేయర్ ని గాజువాక నుంచి వైసీపీ తరఫున నిలబెట్టేందుకు వైసీపీ అధినాయకత్వం డిసైడ్ అయింది. ఈ సీటుకు సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి స్థానంలో కార్పోరేటర్ ఉరుకూటి రామచంద్రరావుని ఇంచార్జిగా కొద్ది నెలల క్రితం ప్రకటించారు.
అయితే ఆయన పట్ల సొంత పార్టీలోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అదే విధంగా చూస్తే గ్రాఫ్ కూడా జనంలో కూడా ఏ మాత్రం పెంచుకోలేకపోతున్నారు అని సర్వే నివేదికలు అధినాయకత్వానికి చేరాయి. గాజువాకను టీడీపీ జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
అటు వైపు నుంచి బలమైన అభ్యర్ధి బరిలోకి దిగబోతున్నారు. అని అంటున్నారు. కూటమి తరఫున టీడీపీ అభ్యర్ధిగా పల్లా శ్రీనివాస్ పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. 2014లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆయనతో పోటీకి అదే సామాజిక వర్గానికి చెందిన మేయర్ హరి వెంకట కుమారిని పోటీకి దించాలన్నది వైసీపీ నయా స్ట్రాటజీగా తెలుస్తోంది. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నారు. దాంతో బొత్స సూచనల మేరకు కూడా ఇక్కడ అభ్యర్థి మార్పు జరిగింది అని అంటున్నారు.
కార్పోరేటర్ చంద్రశేఖరరావుకు కాకుండా ఎవరికైనా టికెట్ ఇస్తే తాము సపోర్ట్ చేస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం కూడా చెప్పడంతో మేయర్ ని వ్యూహాత్మకంగా దింపుతున్నారు. విద్యావంతురాలు, ఉపాధ్యాయురాలిగా పనిచేసి మేయర్ గా మూడేళ్ల కాలంలో వివాదరహితంగా పనిచేస్తున్న ఆమె గాజువాక నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తే మంచి ఫలితం వస్తుందని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది.