Advertisement

Advertisement


Home > Politics - National

450 స్థానాల్లో ముఖా ముఖి పోటీ?

450 స్థానాల్లో ముఖా ముఖి పోటీ?

దేశంలో ముఖాముఖి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. చాలా దశాబ్దాల తర్వాత తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రెండు కూటముల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొనడంతోపాటు రాష్ట్రాల్లోని లోక్‌సభ ఎన్నికలు కూడా ముఖాముఖి కానున్నాయని తెలుస్తోంది. పొత్తులు లేని చోట కూడా ముక్కోణపు పోటీ ఉండేలా కనిపించడం లేదు. అయితే ఈ ముఖాముఖి ఎన్నికలకు మోదీ రంగం సిద్దం చేయగా, ప్రతిపక్షాలు కూడా అదే దృక్పథంతో అడుగు ముందుకు వేస్తున్నాయి. దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో 450 పైగా సీట్లలో ముఖాముఖి పోరు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ప్రాతిపదికన ముఖాముఖి ఎన్నికలకు ప్రతిపక్ష కూటమి సన్నాహాలు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీకి 37 శాతం ఓట్లు రాగా, మిత్రపక్షాలన్నీ కలుపుకుంటే 40 శాతానికి చేరుకుంది. అంటే 60 శాతం మంది ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ 60 శాతం ఓట్లలో 70 శాతం సాధించాలన్నది ప్రతిపక్ష కూటమి ప్రయత్నం. చెల్లాచెదురైన విపక్షాల ఓట్లను ఏకతాటిపైకి తెచ్చి బిజెపికి మించిన ఫలితాలు సాధించాలనే సన్నద్ధతతో ప్రతిపక్ష కూటమి ఎన్నికల సమరానికి సిద్ధమైంది. ఇదే జరిగితే ప్రతిపక్షాలకు బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు లభిస్తాయి.

మరోవైపు బిజెపి కూడా అత్యధిక ఓట్లను సాధించి 50 శాతానికి పైగా ఓట్లు సాధించి స్వంతంగా  370 సీట్లు సాధించాలని, ఎన్డీయేకు 400 పైగా సీట్లు లభించేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఇప్పటి వరకు జరిగిన 17 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకీ 50 శాతం ఓట్లు రాలేదు. 1984లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ 415 సీట్లు గెలుచుకోగా, అప్పుడు కూడా కాంగ్రెస్‌కు 48 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019లో నరేంద్ర మోదీకి 303 సీట్లు వచ్చినప్పటికీ బిజెపికి 37 శాతం ఓట్లు మాత్రమే లభించాయి.

ఇక ప్రతిపక్షాల వైపు చూస్తే 1977లో ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేసి 405 సీట్లలో 295 స్థానాలు పొందాయి. అప్పుడు ప్రతిపక్షాలకు 41.32 శాతం ఓట్లు లభించాయి. 1989 లో కాంగ్రెస్ 40 శాతం ఓట్లు సాధించినప్పటికీ 197 సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. దీనితో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి.

అయితే కొన్ని రాష్ట్రాల్లో త్రిముఖ పోటీతప్పడం లేదు. పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఏర్పడినప్పటికీ  బిజెపి- అకాలీదళ్ కలిసి త్రిముఖ పోటీకి రంగం సిద్దం చేశాయి. ఏపీలో ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీల మధ్య ఉంటుంది. షర్మిల రంగంలోకి దిగినప్పటికీ త్రిముఖ పోటీ ఏర్పర్చేంత సీను కాంగ్రెస్ కు లేదు.

తెలంగాణలో ప్రధాన పోటీ  కాంగ్రెస్, బిఆర్ఎస్ ల మధ్య ఉన్నప్పటికీ త్రిముఖ పోటీ ఏర్పర్చేందుకు బిజెపి సర్వ శక్తులు ఓడుతున్నది. ఒడిశాలో బిజూ జనతాదళ్, బీజేపీ ల మధ్యే ప్రధాన పోటీ ఉండగా, కాంగ్రెస్ త్రిముఖ పోటీని సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది.

బిహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ ,కర్ణాటక వంటి ప్రధాన రాష్ట్రాల్లో ఎన్డీఏకు, ఇండియా కూటమికి ముఖాముఖి పోటీ తప్పే అవకాశాలు లేవు. కేరళలో వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. బిజెపికి అక్కడ త్రిముఖ పోరు ను సృష్టించగల సత్తా లేదు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ – బిజెపి మధ్యే ప్రధాన పోటీ. అక్కడ త్రిముఖ పోటీకి ఛాన్స్ లేదు. కాంగ్రెస్ తో తృణమూల్ కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, వేరుగా పోటీ చేసినప్పటికీ ఆ పార్టీ నిర్ణాయకశక్తి  కాదు.అక్కడ వామపక్షాల భవిష్యత్ ఆ పార్టీ నేతలకే తెలియదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?