Advertisement

Advertisement


Home > Politics - National

ఆ భయంతోనే సోనియా సిమ్లా వెళ్లలేదా?

ఆ భయంతోనే సోనియా సిమ్లా వెళ్లలేదా?

ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. సుఖ్వీందర్ సింగ్ సుక్ఖూ ప్రభుత్వం ఉంటుందా కూలుతుందా అనే సందేహాలు ముసురుకున్నాయి.

భారతీయ జనతా పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి గవర్నరు అనుమతి కోరినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. రాజ్యసభకు ఎంపిక కావడానికి హిమాచల్ ప్రదేశ్ లోని తమ సొంత పార్టీనుంచి ఘనమైన ఆహ్వానం ఉన్నప్పటికీ, సోనియాగాంధీ తిరస్కరించడం వెనుక మర్మం ఇదేనా అని ఇప్పుడు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో భాజపా తమ ప్రభుత్వం వెనుక గోతులు తవ్వుతున్నదని, అక్కడ ప్రభుత్వం కూలవచ్చుననే సంకేతాలు సోనియాకు ముందుగానే అందాయని కూడా పలువురు అనుకుంటున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పోటీచేయబోయేది లేదని సోనియాగాంధీ 2019 ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. ఆ మేరకు ఈదఫా ఆమె రాజ్యసభ ఎంపీగానే వెళ్తారని అందరికీ అర్థమైపోయింది. ఇటీవలి రాజ్యసభ ఎంపీ ఎన్నికల్లో ఆమె హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీచేయాలని అక్కడి పార్టీ ఆహ్వానించింది.

68 సీట్లున్న హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెసుకు 40 సీట్లతో స్పష్టమైన మెజారిటీ ఉంది. ఒకే రాజ్యసభ సీటు కు అక్కడ ఎన్నిక జరగుతుంది. అలాంటి పరిస్థితుల్లో సోనియాగాంధీ పోటీచేస్తే ఏకగ్రీవం అవుతుందని అంతా అనుకున్నారు. అయినా సరే, ఆమె హిమాచల్ ను ఎంచుకోకుండా రాజస్తాన్ వెళ్లారు. అక్కడినుంచి ఎన్నికయ్యారు. ఈలోగా హిమాచల్ లో రాజకీయం తిరగబడింది.

40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఫిరాయించి భాజపా అభ్యర్థి హర్ష్ మహాజన్ కు ఓట్లు వేశారు. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా భాజపా వైపే మొగ్గారు. దరిమిలా బలాలు సమానం అయ్యాయి. కాంగ్రెస్ తరఫున పోటీచేసిన సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వికి, బిజెపికి చెరి సమానంగా 34 ఓట్ల వంతున వచ్చాయి. లాటరీ తీస్తే అదృష్టం బిజెపిని వరించింది. అంతిమంగా.. ఆరుగురు ఫిరాయించిన తర్వాత.. సుఖ్వీందర్ ప్రభుత్వం గడ్డు స్థితిలో పడింది. మరొక్కరు ఫిరాయించితే చాలు.. ప్రభుత్వం కూలుతుంది. ఏ సంగతి అవిశ్వాసంలో తేలుతుంది. ఇంత వరకు వచ్చిన తర్వాత మరొక్క ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టడం బిజెపికి పెద్ద కష్టం కాదనే అంచనాలు సాగుతున్నాయి. 

అయితే ఇక్కడ పార్టీలో తిరుగుబాటు ఉంటుందనే సంగతి సోనియాగాంధీకి ముందే సమాచారం ఉన్నదని, అందుకే ఆమె అక్కడినుంచి పోటీచేయలేదని పలువురు విశ్లేషిస్తున్నారు. అదేసమయంలో మరో విశ్లేషణ కూడా నడుస్తోంది. సోనియాగాంధీ పోటీచేసి ఉంటే గనుక.. పార్టీనుంచి ఈ ఫిరాయింపు ఓట్లు జరిగేవి కాదని, ఆమె గెలవడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్థిరంగా ఉండేదని కొందరు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?