అక్క మాటల్లో అక్కసు తప్ప ఔచిత్యం ఉందా?

ఏపీసీసీ చీఫ్ గా సారథ్యం స్వీకరించినప్పటి నుంచి వైఎస్ షర్మిల ఒక రేంజిలో రెచ్చిపోతూ ఉన్నారు. విపక్ష పార్టీ గనుక, అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కురిపించడం సహజం. అలాగని…

ఏపీసీసీ చీఫ్ గా సారథ్యం స్వీకరించినప్పటి నుంచి వైఎస్ షర్మిల ఒక రేంజిలో రెచ్చిపోతూ ఉన్నారు. విపక్ష పార్టీ గనుక, అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కురిపించడం సహజం. అలాగని ఇతర ప్రతిపక్షాల మీద కూడా అదేస్థాయి విమర్శలు ఉండాలి. కనీసం నిజాలు మాట్లాడాలి.

కానీ వైఎస్ షర్మిల పరిస్థితి ఎలా ఉన్నదంటే.. చంద్రబాబును తిట్టవలసి వచ్చినప్పుడు తమలపాకుతో కొట్టినట్టుగా, జగన్ ను తిట్టవలసి వస్తే మాత్రం తలుపుచెక్కతో కొట్టినట్టుగా సాగుతోంది. అందుకే, ఆమె చంద్రబాబు కీ ఇచ్చి నడిపిస్తున్న కీలుబొమ్మ అనే విమర్శలను ఎదుర్కొంటోంది. అలాగే, షర్మిలక్క మాటల్లో అన్న జగన్ మీద అక్కసు తప్ప.. ఔచిత్యం ఇసుమంతైనా కనిపించడం లేదనే విమర్శలను కూడా ఎదుర్కొంటోంది.

వైఎస్ షర్మిలకు ప్రస్తుతానికి అధికారంలోకి వచ్చేసి, నెరవేర్చవలసిన బాధ్యత లేదు కాబట్టి.. ఏదిపడితే ఆ హామీలను ఇచ్చేస్తోంది. బిజెపిని, వైసీపీని కూడా ప్రధానంగా టార్గెట్ చేయడానికి షర్మిల ప్రత్యేకహోదా అనే అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి హోదా విషయంలో గతంలో ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదంటూ చాలా మాటలు అంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలోనే ఉన్నదంటూ విమర్శలు చేస్తున్నారు.

అదే సమయంలో ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రానికి చంద్రబాబు చేసిన ద్రోహాలు మాత్రం షర్మిలకు పెద్దగా కనిపించకపోవడం విశేషం. బాబు చేసిన హోదా మోసాల గురించి ఒకటిరెండు మాటలతో ముగిస్తున్నారు.

శుక్రవారం నాడు తిరుపతి నుంచి ప్రత్యేకహోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ తరఫున డిక్లరేషన్ ప్రకటిస్తాం అంటూ షర్మిల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఏ తిరుపతి నుంచి అయితే నరేంద్రమోడీ ప్రత్యేకహోదా హామీని రాష్ట్రప్రజలకు అందించారో.. అదే తిరుపతి నుంచి హోదా డిక్లరేషన్ ప్రకటించడానికి షర్మిల పూనుకోవడం విశేషం.