ఆ కళంకం తెలుగుదేశాన్ని ముంచదా?

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజానామా చేయడం అనే లాంఛనం పూర్తయింది. సుదీర్ఘకాలంగా జగన్మోహన్ రెడ్డి నుంచి తనకు అనుకూల సిగ్నల్ వస్తుందని ఎదురుచూసిన మాగుంట ఇక తన…

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజానామా చేయడం అనే లాంఛనం పూర్తయింది. సుదీర్ఘకాలంగా జగన్మోహన్ రెడ్డి నుంచి తనకు అనుకూల సిగ్నల్ వస్తుందని ఎదురుచూసిన మాగుంట ఇక తన ఆశ నిరాశ చేసుకున్నారు.

జగన్ అనుగ్రహం కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా సుదీర్ఘ కాలం రాయబారాలు నడిపిన ఆయన, అవన్నీ నిష్ఫలం అయ్యేసరికి ఎగ్జిట్ వెతుక్కున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రోజునే.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోయే సంగతి కూడా దాదాపుగా బయటపడిపోయింది. 

రాజీనామా తర్వాత ఒక కార్యక్రమంలో మాగుంటతో పాటు పాల్గొన్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంగతి బయటపెట్టారు. ‘మాగుంట తెలుగుదేశంలోకి వెళితే బాలినేని కూడా వెళ్లాలని లేదు’ అంటూ ఆయన అనడాన్ని బట్టి.. టీడీపీలో చేరికను ధ్రువీకరించినట్టే. అలాగే .. తన రాజీనామా గురించి ప్రకటించిన సమావేశంలోనే రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ స్థానం నుంచి తన కుమారుడు మాగుంట రాఘవ్ రెడ్డి పోటీచేయబోతున్నారని కూడా శ్రీనివాసులురెడ్డి ప్రకటించడం విశేషం.

అయితే ఇప్పుడు జనంలో మొదలవుతున్న చర్చ ఏంటంటే.. మద్యం కేసుల్లో అత్యంత కళంకితులు అయిన మాగుంట ఫ్యామిలీని.. సరిగ్గా ఎన్నికలకు ముందు చేరదీయడం ద్వారా, అదికూడా వారికి వైసీపీలో అవకాశాలు మృగ్యం అయిపోయిన తర్వాత, వారికి టీడీపీలో అందలాలు కట్టబెట్టడం ద్వారా చంద్రబాబునాయుడు ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపదలచుకుంటున్నారు?

చంద్రబాబునాయుడు సాగించే అవినీతి బాగోతాల గురించి ప్రజలందరికీ తెలుసు. అలాగని, మాంసం తిన్నందుకు ఎముకలు మెడలో వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు కదా అనేది ప్రజల మాట. చంద్రబాబునాయుడు చాటుమాటుగా అవినీతి వ్యవహారాలు సాగించే నాయకుడే కావొచ్చు గాక.. అలాగని.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా దొరికిపోయిన మాగుంట కుటుంబాన్ని చేరదీసి, నిందితుడు రాఘవ్ రెడ్డికి ఎంపీ టికెట్ కట్టబెట్టడం వల్ల పార్టీ పరువు పోతుంది కదా.. అని పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కళంకితుడైన, లిక్కర్ స్కాం ముద్ర పడిన రాఘవ్ రెడ్డి కి టికెట్ ఇవ్వడం వల్ల.. ప్రత్యర్థులకు తమంత తాముగా ఒక అస్త్రాన్ని అందించినట్లు అవుతుందని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. మాగుంట కుటుంబం తెలుగుదేశంలోకి వస్తే.. ఆర్థిక వనరుల పరంగా అండగా ఉంటారనే ఆశ చంద్రబాబుకు ఉండవచ్చు గానీ.. అలాంటి కళంకితుల్ని చేర్చుకోవడం వల్ల లాభం కంటె నష్టం ఎక్కువనే వాదనే వినిపిస్తోంది.